నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం..

నిడమనూరు / నల్గొండ ఈక్షణం, నవంబర్ 10: విద్యాబుద్ధులు నేర్చుకుంటూ సురక్షితంగా ఉండాల్సిన గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలకు రక్షణ కరువైంది. పారిశుద్ధ్య పనుల నిమిత్తం పాఠశాలలో పనిచేస్తున్న ఒక సిబ్బంది కామాంధుడిగా మారి చిన్నారి విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (Social Welfare Gurukul School) లో ఈ అక్రమార్కం వెలుగుచూసింది.

పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు తమను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నాడని మైనర్ విద్యార్థినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను బలవంతంగా బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని, తమ శరీర భాగాలపై తాకరాని చోట తాకుతూ అనాగరికంగా ప్రవర్తిస్తున్నాడని చిన్నారి బాధితులు తెలిపారు.

గత కొంతకాలంగా ఈ వేధింపులు జరుగుతున్నప్పటికీ బయటకు చెప్పేందుకు భయపడిన బాలికలు, శృతిమించడంతో తోటి విద్యార్థులకు, ఆ తర్వాత తల్లిదండ్రులకు విషయం వెల్లడించారు.

ఈ విషయం తెలియడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహంతో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పవిత్రమైన విద్యాసంస్థల్లో మైనర్ బాలికలపై ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న కీచక కార్మికుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాఠశాల నిర్వాహకులు, అధికారుల పర్యవేక్షణ లోపంపై కూడా విచారణ జరిపించాలని కోరారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మరియు సంక్షేమ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు.