Breaking News: శ్రీదేవిపై దాడి ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ విచారణ

నల్గొండ, ఈ క్షణం: బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తల్లి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నాగం శ్రీదేవిపై దాడి జరిగినట్లు అందిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై వాస్తవాలను నిర్ధారించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నవంబర్ 10న ఉత్తర్వులు జారీ చేసింది.

కమిషన్‌కు అందిన ఫిర్యాదు ప్రకారం.. ఆగస్టు 31న నల్గొండలోని శ్రీదేవి నివాసంలోకి మాజీ మున్సిపల్ చైర్మన్ నేతృత్వంలో సుమారు 50 మంది సాయుధ వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి, ఆమెతో పాటు ఆమె సోదరుడిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లోని ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు కీలక డిజిటల్ ఆధారాలను అపహరించారని, కుటుంబ సభ్యులను ప్రాణహాని బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నివేదితా సుబ్రమణియన్, సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నల్గొండలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించనుంది. అవసరమైతే ఇతర ప్రాంతాల్లోనూ విచారణ చేపట్టనుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించడంతో పాటు బాధితురాలు, సాక్షులు, ఇతర సంబంధిత వ్యక్తులను కలిసి వివరాలు సేకరించనుంది. విచారణ అనంతరం తగిన చర్యలకు సిఫార్సులతో కూడిన నివేదికను 10 పనిదినాల్లోగా కమిషన్‌కు సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.