Video: నిడమనూరు ఘటన మరవకముందే పెద్దవూర పాఠశాలలో దారుణం..

నల్గొండ ఈక్షణం, నవంబర్ 11: నల్గొండ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దారుణాలు తీవ్ర అశాంతిని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. నిన్న నిడమనూరు మండలంలోని గురుకుల పాఠశాలలో కీచక పారిశుద్ధ్య కార్మికుడు మైనర్ బాలికలను వేధించిన ఘటన మరువక ముందే, ఈరోజు జిల్లాలోని పెద్దవూర గురుకుల పాఠశాలలో మరో ఘోర ఉదంతం వెలుగుచూసింది.

పాఠశాల ఆవరణలోకి చొరబడిన దుండగులు మైనర్ విద్యార్థులపై అత్యంత దారుణంగా భౌతిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

పెద్దవూర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు మైనర్ విద్యార్థులను అడ్డుకున్న అపరిచిత దుండగులు, వారిని బలవంతంగా నేలపై కూర్చోబెట్టారు. అనంతరం వారిపై పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. దెబ్బలు తాళలేక చిన్నారులు కేకలు వేసినా, రక్షించేందుకు సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో దుండగులు తమ వికృత చేష్టలను కొనసాగించారు. గాయపడిన విద్యార్థుల అరుపులు విన్న తోటి విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఒకరోజు వ్యవధిలోనే నిడమనూరు, పెద్దవూర గురుకులాల్లో వరుసగా దారుణాలు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ గురుకులాల్లో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే బయటి వ్యక్తులు స్వేచ్ఛగా లోపలికి వచ్చి దాడులకు ఒడిగడుతున్నారని మండిపడుతున్నారు.

ఈ వరుస ఘటనలపై జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించి, అన్ని గురుకులాల్లో శాశ్వత సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.