Breaking News: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా విధానం రద్దు

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 11: తెలంగాణ విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్య (School Education) లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బుధవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు, తెలంగాణ విద్యా కమిషన్ ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

జాతీయ స్థాయిలో అమలవుతున్న CBSE, ICSE మరియు జాతీయ విద్యా విధానం (NEP) తరహాలోనే తెలంగాణలోనూ 10+2 విద్యా విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై 11వ తరగతి (Class 11), 12వ తరగతి (Class 12) లు పాఠశాల విద్య పరిధిలోనికే వస్తాయి. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ బోర్డు లేదా జూనియర్ కళాశాలల వ్యవస్థ ఉండదు.

విద్యార్థుల్లో డ్రాపౌట్లను నిరోధించడం, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నిరంతరాయమైన, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

12వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు వెంటనే ఉపాధి అవకాశాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి (Skill Development) కోర్సులను కూడా అందుబాటులోకి తేనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక వసతులను భారీగా మెరుగుపరచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి పాఠ్యప్రణాళిక మార్పులు, మౌలిక సదుపాయాల కల్పన మరియు ఉపాధ్యాయుల సర్దుబాటుపై తక్షణమే సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.