
నల్లగొండలో మూడు రోజుల పాటు భారీ అగ్రి షో
- 29 రాష్ట్రాల నుంచి రైతు ప్రతినిధుల రాక..
- 125 స్టాళ్లు, ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన!
- నవంబర్ 14, 15, 16 తేదీల్లో క్లాక్‌టవర్ సెంటర్ వేదికగా ప్రదర్శన..
- ప్రారంభోత్సవానికి మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి హాజరు కానున్నట్లు తెలిపిన నంద్యాల నర్సింహారెడ్డి!
నల్లగొండ ఈక్షణం, నవంబర్ 12: అఖిల భారత రైతు సంఘం (AIKS) 41వ జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు భారీ స్థాయిలో ‘అగ్రి షో’ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం సీనియర్ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో అగ్రి షో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి రైతు ఉద్యమ నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ మహాసభలకు తరలిరానున్నారని పేర్కొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, యంత్ర పరికరాలు, నూతన సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మొత్తం 125 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
డ్రోన్లు, పామాయిల్ సాగు, ఆధునిక యంత్రాల ప్రదర్శన..
ఈ అగ్రి షోలో విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, అగ్రి డ్రోన్లు, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ప్రతినిధులు స్వయంగా హాజరై పంటల సాగు, చీడపీడల నివారణపై రైతులకు ఉచితంగా సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే సహకార బ్యాంకు స్టాల్ ద్వారా వ్యవసాయ రుణాల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
తక్కువ నీటితో అధిక దిగుబడులపై ప్రత్యేక దృష్టి..
నల్లగొండ జిల్లాలో నీటి వనరుల కొరత దృష్ట్యా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ఆధునిక నీటిపారుదల పద్ధతులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు నంద్యాల నర్సింహారెడ్డి వివరించారు. జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో సాగవుతున్న పామాయిల్ పంటకు సంబంధించిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
రైతులతో పాటు పట్టణ ప్రజలు కూడా ఈ అగ్రి షోను సందర్శించి వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులను తెలుసుకోవాలని ఆయన కోరారు.







