పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

నల్లగొండ, ఈక్షణం: ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రానున్న పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ధాన్యం ముందుగానే కొనుగోలు కేంద్రాలకు చేరుతున్నందున ఈ రెండు నియోజకవర్గాల్లో మొదట కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ బి. చంద్రశేఖర్, ధాన్యం సేకరణ అధికారులతో 2026-27 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతిరోజూ గంటపాటు ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వ గోదాములను వినియోగిస్తున్నామని కలెక్టర్ వివరించారు. వీబీ-జీ రామ్ జీ పథకం కింద గోదాముల నిర్మాణానికి ఉన్న అవకాశాలను మంత్రి ప్రస్తావించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో గోదాముల నిర్వహణకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వచ్చే రెండేళ్లలో జిల్లాలో అవసరమైన గోదాములను సిద్ధం చేయాలని సూచించారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ సొరంగం పూర్తయితే జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో పంటల సాగుకు అవకాశం ఉంటుందని, తద్వారా ధాన్యం దిగుబడి పెరిగే అవకాశమున్నందున ముందుగానే నిల్వ సదుపాయాలు కల్పించాలని చెప్పారు.

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, సాగునీటి వినియోగం, విద్యుత్ సరఫరా, ఆరుతడి పంటల సాగుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని, వచ్చే వర్షాకాలం వరకు నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరముందని కలెక్టర్ తెలిపారు. నీటి లభ్యత, ఎంతకాలం సరిపోతుందనే వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నామని, రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లేలా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

విద్యుత్ సరఫరాపై ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసరావుతో మంత్రి సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 14 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఎస్‌ఈ తెలిపారు.

నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో మామిళ్లగూడెం సమీపంలో 12 టవర్లతో ఇందిరమ్మ టవర్స్ నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో టవర్‌లో 40 ఇళ్ల చొప్పున మొత్తం 480 ఇళ్లు నిర్మించేందుకు ఆరు ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించగా, మంత్రి అంగీకారం తెలిపారు. వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని, ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. నల్గొండ పట్టణంలో ప్రతి సంవత్సరం 500 ఇళ్ల చొప్పున మొత్తం రెండు వేల ఇళ్లను ఇళ్లు లేని నిరుపేదలకు అందించనున్నట్లు వెల్లడించారు.

చందనపల్లి డంపింగ్ యార్డును మరో ప్రాంతానికి తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాలు లేని ప్రాంతంలో వంద ఎకరాల స్థలాన్ని గుర్తించి అక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, అక్కడ పార్కు ఏర్పాటు, చెరువు కట్ట సుందరీకరణ, దేవాలయ అభివృద్ధి, పానగల్ ఉదయ సముద్రం నుంచి తాగునీటి సరఫరా వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డును త్వరగా తరలించాలని కలెక్టర్‌కు స్పష్టం చేశారు.

2026-27 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 2.35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం ఉంటుందని వివరించారు. కొనుగోళ్ల కోసం జిల్లాలో 307 కేంద్రాలను ప్రతిపాదించగా, ఇప్పటివరకు 100 కేంద్రాలను ప్రారంభించామని, వాటిలో 65 కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయని తెలిపారు. ఈ కేంద్రాలకు ఇప్పటివరకు 55,174 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, పౌరసరఫరాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.