
Eekshanam Exclusive: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ‘పవర్ గేమ్’!
- ఆదర్శ కార్పొరేషన్ లక్ష్యానికి అడ్డంకులు?
- అన్ని సక్రమంగా ఉంటేనే నిర్మాణ అనుమతులు..
- కార్పోరేషన్లో 150 ఫైళ్లు పెండింగ్..?
- ఆస్తిపన్ను బకాయిలుంటే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు బంద్
- నిక్కచ్చిగా పనిచేసిన కమిషనర్ పైనా కన్నెర్ర..!
- పాత కమిషనర్ అహ్మద్ హయాంలోనే ఆగమాగం..
- ఆనాడే హెచ్చరించినా పట్టించుకోని నేతలు..
- వచ్చే నెల నుంచి డివిజన్లలో రచ్చబండ కార్యక్రమం!
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం న్యూస్: నల్గొండను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాలన్నది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లక్ష్యం. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు మున్సిపల్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొందరు కార్పొరేటర్ల వ్యవహారశైలి ఇందుకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గం ఉన్నప్పటికీ కొందరి వ్యక్తిగత పెత్తనం, మున్సిపల్ వ్యవహారాల్లో ఆధిపత్యం కోసం సాగుతున్న ప్రయత్నాలు కార్పొరేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. గతంలో మున్సిపాలిటీలో చోటుచేసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, అప్పటి అధికారుల వ్యవహారాలు ఒకవైపు ఉంటే.. వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన వంశీ కృష్ణ వంటి అధికారి మూడు నెలలకే బదిలీ కావడం మరోవైపు చర్చనీ యాంశమైంది. నిర్మాణ అనుమతుల నుంచి పన్నుల వసూళ్ల వరకు నిబంధనలను కఠినంగా అమలు చేయడం, అక్రమాలకు తావులేకుండా వ్యవహరించడం కొందరికి ఇబ్బందిగా మారిందా? మున్సిపాలిటీపై పట్టు కోసం జరుగుతున్న అంతర్గత ఆధిపత్య పోరులో అధికారులే పావులుగా మారుతున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అన్ని సక్రమంగా ఉంటేనే పర్మిషన్.. 150 ఫైళ్లు పెండింగ్!
మున్సిపల్ కార్పొరేషన్లో నిర్మాణ అనుమతుల వ్యవహారం గతంలో అనేక విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో కమిషనర్ వంశీకృష్ణ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థలం, లేఅవుట్, బఫర్‌జోన్, డ్రైనేజీ, ఇరిగేషన్ పరిధి తదితర అంశాల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అన్ని అనుమతులు, క్లియరెన్స్‌లు సక్రమంగా ఉంటేనే నిర్మాణ అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరమైన చోట సంబంధిత శాఖల నుంచి స్పష్టత కోరుతూ ఫైళ్లను పంపించారు. దీంతో సుమారు 150 నిర్మాణ అనుమతుల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. గతంలో మాదిరిగా నిబంధనలను పక్కనపెట్టి అనుమతులు ఇవ్వకుండా, ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న ఆయన వైఖరి కొందరికి నచ్చలేదన్న ప్రచారం ఉంది. అయితే నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వడం పరిపాలనా బాధ్యత కాగా, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే కీలకం.
పన్ను కడితేనే సర్టిఫికెట్..
ఆస్తిపన్ను, నల్లా బిల్లుల బకాయిల వసూళ్లపైనా కమిషనర్ కఠినంగా వ్యవహరించారు. బకాయిలు చెల్లించకపోతే జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే డెత్ సర్టిఫికెట్ పొందాలంటే ఆస్తిపన్ను బకాయిలు క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలున్నాయి. ఇంటి యజమాని పన్ను చెల్లించకపోతే అద్దెకు ఉంటున్న వారిపైనా ఒత్తిడి పడిందని, యజమాని బకాయిలకు అద్దెదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని బాధితులు వాపోతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, వితంతువులు, ఉపాధి లేని పేదలు అప్పులు చేసి బకాయిలు చెల్లించి ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. బకాయిల వసూళ్లలో కఠినంగా వ్యవహరించాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ, పేదల అవసరమైన ధ్రువీకరణ పత్రాలను బకాయిలతో ముడిపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
అహ్మద్ హయాంలో ఆగమాగం.. ఆనాడే హెచ్చరికలు!
నల్లగొండ మున్సిపాలిటీలో గతంలో పనిచేసిన కమిషనర్ల హయాంలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. రమణాచారి తర్వాత కమిషనర్‌గా పనిచేసిన ముసేబ్అహ్మద్ హయాంలో ఎన్ఓసీ(NOC)లు, నిర్మాణ అనుమతుల వ్యవహారంలో పలు ఆరోపణలు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. కొన్ని నిర్మాణాలు పూర్తికాకముందే ఎన్ఓసీలు జారీ చేశారన్న ఆరోపణలు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న విమర్శలు అప్పట్లో తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారాలపై మంత్రి కోమటిరెడ్డి స్థాయిలోనే అసంతృప్తి వ్యక్తమైందని, అప్పుడే అధికారిని మార్చాలని సూచనలు వచ్చినప్పటికీ స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధులు ఆయన కొనసాగింపునకు మొగ్గు చూపినట్లు సమాచారం. కొత్త అధికారి వస్తే తమ ఆటలు సాగవని, అప్పటికే అనుభవం ఉన్న అధికారి కొనసాగితేనే మంచిదని అప్పట్లో వాదించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు అప్పటి నిర్ణయాల పై ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడే మార్పుకు అంగీకరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా? అన్న చర్చ ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తోంది.
ఆధిపత్యం కోసం అధికారులే అస్త్రాలా?
మున్సిపల్ కార్పొరేషన్లో కొందరు కార్పొరేటర్లకు కొన్ని విభాగాలపై గట్టి పట్టుందని, తమకు అనుకూలంగా వ్యవహారాలు సాగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. పాలకవర్గం ఉన్నప్పటికీ సమష్టి నిర్ణయాల కంటే కొందరి వ్యక్తిగత పలుకుబడే కీలకంగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్యం, సిబ్బంది విధులు, నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు వంటి అంశాల్లో అధికారుల నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ సాగుతోంది. పాలకవర్గం నేరుగా జోక్యం చేసుకుంటే ఇతర కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో అధికారుల ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న వ్యూహం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారి వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న భావన కొందరిలో ఏర్పడుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
క్యూర్ కోడ్లు.. డీజిల్ ఆదా.. సిబ్బందిపై నిఘా!
వంశీకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య విభాగంలో క్యూర్ కోడ్ లను ప్రవేశపెట్టారు. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. మున్సిపల్ వాహనాల డీజిల్ వినియోగంలో వృథాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదనపు సిబ్బందిని, అర్హతలకు అనుగుణంగా విధులు నిర్వహించని సిబ్బందిని వార్డులకు పంపించారు. దీంతో గతంలో తమకు అనుకూలంగా సాగిన కొన్ని వ్యవహారాలకు అడ్డుకట్ట పడిందన్న భావన కొందరిలో ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే అన్ని విభాగాలపై ఒకేసారి కఠినంగా వ్యవహరించడం వల్ల కొంత అసంతృప్తి కూడా వ్యక్తమైంది. దశలవారీగా మార్పులు తీసుకొచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ మున్సిపల్ వ్యవస్థలో క్రమశిక్షణ తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలను, వాటి అమలులో ఎదురైన సమస్యలను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉంది.
మూడు నెలలకే బదిలీ.. కన్నెర్ర చేసింది ఎవరు?
మంత్రి కోమటిరెడ్డి సూచనల మేరకు నల్లగొండకు వచ్చిన వంశీకృష్ణ కేవలం మూడు నెలల వ్యవధిలోనే బదిలీ కావడం చర్చనీయాంశమైంది. ఒకవైపు ఆదర్శ కార్పొరేషన్ లక్ష్యంతో మున్సిపల్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు కఠినంగా వ్యవహరించిన అధికారిపై వ్యతిరేకత పెరగడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన నిర్ణయాలతో ఇబ్బందిపడిన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయా? కొందరు కార్పొరేటర్లు ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించారా? మున్సిపాలిటీలో తమ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతోందన్న భావనతో బదిలీ కోసం ఒత్తిడి తెచ్చారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
కొత్త కమిషనర్ చుట్టూ కొత్త సమీకరణాలు!
వంశీకృష్ణ బదిలీతో ఇన్చార్జి కమిషనర్‌గా శ్రీజారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆమె నల్లగొండకు చెందిన అధికారి కావడంతో పూర్తిస్థాయి కమిషనర్‌గా కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ కార్పొరేటర్లలో వినిపిస్తోంది. కొత్త కమిషనర్ ఎలాంటి విధానాలతో ముందుకెళ్తారు? గతంలో ప్రారంభించిన క్రమశిక్షణ చర్యలు కొనసాగిస్తారా? నిర్మాణ అనుమతుల పరిశీలన, పన్నుల వసూళ్లు, సిబ్బంది పర్యవేక్షణలో అదే కఠిన వైఖరి ఉంటుందా? లేక మున్సిపల్ వ్యవహారాల్లో మళ్లీ పాత పద్ధతులే కొనసాగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆదర్శ కార్పొరేషన్ లక్ష్యం నెరవేరేనా..?
మొత్తంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు అభివృద్ధి లక్ష్యానికి, వ్యక్తిగత ఆధిపత్య పోరుకు మధ్య వైరుధ్యం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండను రాష్ట్రంలోనే ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాలని సంకల్పిస్తే, కొందరు కార్పొరేటర్ల వ్యవహారశైలి ఆ లక్ష్యానికి విఘాతం కలిగిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల నుంచి కార్పోరేషన్లో రచ్చబండ తరహా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. డివిజన్లలో నెలకొన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందింస్తున్నారు. మేయర్, కమిషనర్ ఇద్దరు మహిళలే కావడంతో సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందని భావిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి సూచన మేరకు నిజంగానే రచ్చబండ కార్యక్రమం అమలైతే విశేష ప్రజాదరణ లభిస్తుందని, పైగా పాలకవర్గం ఏర్పడి ఏడాది కావొస్తున్నందున రచ్చబండతో పాలన మరింత మెరుగు పడుతుందనే అభిప్రాయం పట్టణ ప్రజల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాలకవర్గం సమష్టిగా పనిచేసి నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందా? లేక మున్సిపల్ వ్యవస్థపై పట్టు కోసం ‘పవర్ గేమ్’ కొనసాగుతుందా? అన్నది రానున్న పరిణామాలే తేల్చనున్నాయి.







