పల్నాడు వాటర్ గ్రిడ్ కు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడుదాం

నల్లగొండ బ్యూరో, ఈక్షణం: పల్నాడు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ అనవసర ఆరోపణలు, రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసం అని, పల్నాడు ప్రాజెక్టు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పల్నాడు ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైందన్నది ముఖ్యం కాదని, దాన్ని ఎలా అడ్డుకోవాలన్నదే ఇప్పుడు ప్రధానమని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంలో అధికారులు విఫలమయ్యారని, సరైన సమయంలో స్పందించకుండా జాప్యం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నందున కేంద్రం కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయాలని కోరారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను తక్కువగా చూపించి నాగార్జునసాగర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తరలించడం సరికాదన్నారు.

పల్నాడు ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌ అనవసర ఆరోపణలు చేయకుండా తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం కలిసి రావాలని కోమటిరెడ్డి సూచించారు. రాజకీయ విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం సొరంగ మార్గం పనులు పూర్తి చేయకపోవడం పెద్ద తప్పిదమని విమర్శించారు. గత పదేళ్లలో సొరంగ మార్గం పూర్తయి ఉంటే శ్రీశైలం డెడ్‌ స్టోరేజీ నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తీసుకొచ్చే అవకాశం ఉండేదన్నారు.

శ్రీశైలం సొరంగ మార్గం పనులను వేగవంతం చేసి 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని దాటుకుని మరో కిలోమీటరు మేర పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. సొరంగ మార్గం పూర్తయితే నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. పల్నాడు ప్రాజెక్టును అడ్డుకోవడంతో పాటు తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.