Eekshanam Exclusive: బీజేపీ బీసీ అస్త్రం.. బీఆర్‌ఎస్‌ గెలుపు మంత్రం!

నల్లగొండ బ్యూరో, ఈక్షణం: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అస్త్రంతో బీజేపీ కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీసిందా? నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానంలో సుంకరి భిక్షం గౌడ్‌ను బరిలోకి దింపడం వెనుక బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం చేకూర్చే రాజకీయ వ్యూహాం ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో భిక్షంగౌడ్‌ చేరికతో ఈ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రహస్య అవగాహన కుదిరిందన్న ప్రచారం నేపథ్యంలో భిక్షంగౌడ్‌ చేరిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పీఆర్టీయూ(PRTU) రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండకు చెందిన భిక్షం గౌడ్‌ ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన చేరికను సాధారణ రాజకీయ పరిణామంగా కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంలో భాగంగా చూస్తున్నట్లు బీసీ సంఘాలు, పీఆర్టీయూలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. నల్లగొండ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టడం, ఇప్పుడు భిక్షం గౌడ్‌ను పార్టీలోకి తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహాం ఉందని ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఈ స్థానంలో బీఆర్‌ఎస్‌ బీజేపీకి మద్దతు ఇవ్వడం, నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ స్థానంలో బీజేపీ బీఆర్‌ఎస్‌కు సహకరించడం ద్వారా రెండు పార్టీలకు పరస్పర రాజకీయ ప్రయోజనం కలిగేలా అవగాహన కుదిరిందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం. ఈ వ్యవహారం లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తెర వెనుక కీలకంగా వ్యవహరించినట్లు కూడా చర్చ జరుగుతోంది. పీఆర్టీయూ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వర్గం ఢీల్లో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానంలో బీజేపీకి గెలుపుపై నిజంగా ఆసక్తి ఉంటే, ఆర్థికంగా బలమైన, రాజకీయంగా ప్రభావం ఉన్న అభ్యర్థిని నిలబెట్టేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దించిన నేపథ్యంలో, బీజేపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను నిలబెడితే పోటీ మరింత రసవత్తరంగా ఉండేదని విశ్లేషిస్తున్నారు. అయితే బీసీ నేత భిక్షం గౌడ్‌ను పార్టీలో చేర్చుకుని అభ్యర్థిగా నిలబెడితే, బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చిన పార్టీగా బీజేపీకి రాజకీయ ప్రయోజనం దక్కుతుంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా సహరించినట్టు అవుతుంది. బీసీ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగిస్తున్నా, దాని వల్ల రాజకీయంగా లాభపడేది బీఆర్‌ఎస్‌ అవుతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ ఇప్పటి వరకు రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. భిక్షం గౌడ్‌ చేరికతో తెరవెనుక సాగుతున్న రాజకీయ వ్యూహం బయటపడిందని పీఆర్టీయూలోని ఓ వర్గం వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. భిక్షం గౌడ్‌ చేరిక సందర్భంగా రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. పార్టీలో చేరినంత మాత్రాన ఆయనే అభ్యర్థి అని భావించవద్దని, అభ్యర్థిని హైకమాండ్‌ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో భిక్షం గౌడ్‌ చేరికకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ టికెట్‌పై ఇంకా స్పష్టత లేదన్న విషయం వెల్లడవుతోంది.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో సుమారు 40 వేల సభ్యత్వం ఉన్నట్లు చెప్పుకునే పీఆర్టీయూ సంఘం ఓటు బలం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే సంఘం సభ్యత్వం మొత్తం ఎన్నికల్లో ఓట్లుగా మారుతుందా? అన్నది ప్రశ్నార్థకమే. గత టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు 26 వేల మంది ఓటర్లు ఉండగా, ఓటుకు ఐదు వేలు ఖర్చు పెట్టినా శ్రీపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత కింద ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చాయని సంఘంలోని ఓ వర్గం గుర్తు చేస్తోంది. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే సంఘం ఓట్లు పూర్తిగా బదిలీ కాలేదని చెబుతున్నప్పుడు, 6.50 లక్షల మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్న ఎన్నికల్లో పీఆర్టీయూ ఎంత ప్రభావం చూపగలదన్న ప్రశ్న తలెత్తుతోంది. భిక్షం గౌడ్‌ బీజేపీలో చేరిన సందర్భంగా పీఆర్టీయూ నాయకులు పెద్దగా ఆయన వెంట కనిపించకపోవడం కూడా సంఘంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న చర్చకు కారణమైంది.

కాంగ్రెస్‌ నుంచి సర్వోత్తమ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి రాకేష్‌రెడ్డి బరిలో ఉండటంతో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఈ రెండు పార్టీల మధ్య చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. పీఆర్టీయూ ఓట్లు కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య చీలిపోతే, బీజేపీ అభ్యర్థిగా భిక్షం గౌడ్‌కు వచ్చే ఓట్లు పరిమితంగానే ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు 2024 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీకి 43,313 ఓట్లు రాగా, 2021లో 39,102 ఓట్లు వచ్చాయి. ఈ ఓటు బ్యాంకుతో పాటు పీఆర్టీయూ మద్దతు కలిస్తే గట్టి పోటీ ఇవ్వగలమన్న ధీమా భిక్షం గౌడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పీఆర్టీయూ సొంత బలం మాత్రమే సరిపోదని, బీజేపీ ఓట్లు పూర్తిగా బదిలీ కావడం, బీసీ ఓటర్లు ఏకతాటిపైకి రావడం కీలకంగా మారనుంది.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న ప్రచారం నిజమైతే, అది భిక్షం గౌడ్‌ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బీసీ నేతగా ఆయనకు ఉన్న గుర్తింపును బీజేపీ ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటుందా? లేక నిజంగానే ఎమ్మెల్సీగా గెలిపించే లక్ష్యంతో ముందుకు తీసుకొస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించింది. అయితే పీఆర్టీయూ తమ అభ్యర్థి భిక్షం గౌడ్ పేరును కూడా కాంగ్రెస్ కంటే ముందుగానే ప్రకటించింది. కానీ పార్టీల మద్దతు లభించలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్ధతు కోసం ప్రయత్నించిన్నప్పటికీ లాభం లేకపోయింది. చివరకు బీజేపీ తో చర్చలు జరిపిన నేపథ్యంలో శ్రీపాల్ రెడ్డి తో సహా, పీఆర్డీయూ మొత్తం బీజేపీలో చేరాలనే కండీషన్ పెట్టింది. అయితే బీజేపీలో కూడా పైస్థాయిలో విభేదాలు ఉండటం, బీఆర్ఎస్ తో ఉన్న ఒప్పందం మేరకు శ్రీపాల్ రెడ్డి ప్ర తిపాధనను సున్నితంగా తిరస్కరించారని సంఘం నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు భిక్షం గౌడ్ ను బీజేపీ, బీఆర్ఎస్ పావులా వాడుకునే అవకాశాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేమని అంటున్నారు.