
నల్గొండ బైపాస్ పనులపై స్వతంత్ర విచారణ జరిపించాలి: నాగం వర్షిత్ రెడ్డి
- రూ. 140 కోట్ల మట్టి తవ్వకాలపై ఆడిట్‌కు డిమాండ్..
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి వినతి!
- ఎన్‌హెచ్-565 బైపాస్ నిర్మాణంలో 2 లక్షల టిప్పర్ లోడ్ల అక్రమ మట్టి తవ్వకాలు, నాసిరకం చౌడు మట్టి వాడకంపై ఆరోపణలు..
- 60 అడుగుల లోతు తవ్వకాలు, జీఎస్బీ-డబ్ల్యూఎంఎం పొరలపై ల్యాబ్ టెస్టులు చేయించాలని విజ్ఞప్తి!
నల్లగొండ ఈక్షణం: ఎన్‌హెచ్-565 (NH-565) పరిధిలోని నకిరేకల్–నాగార్జునసాగర్ సెక్షన్లో రూ. 516.17 కోట్లతో చేపట్టిన 14 కిలోమీటర్ల నాలుగు వరుసల నల్గొండ బైపాస్ నిర్మాణ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు, జలవనరుల ప్రాంతాల్లో మట్టి తవ్వడం, రోడ్డు నిర్మాణానికి అనువుకాని నాసిరకం మట్టిని వాడటం వంటి అంశాలపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం సిద్ధం చేశారు.
రూ. 140 కోట్ల విలువైన మట్టి తవ్వకాలు.. రాయల్టీ ఎగవేతపై ఆడిట్‌కు డిమాండ్!
పానగల్ వైపు నుంచి మర్రిగూడ బైపాస్ జంక్షన్, మర్రిగూడ శివారు, కత్తల్గూడ, దేవరకొండ రోడ్డు మీదుగా ఎస్ఎల్బీసీ సమీపంలో నాగార్జునసాగర్ రోడ్డుకు కలిసే ఈ బైపాస్ కోసం భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు జరిపారని డా. నాగం వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు.
తవ్వకాలు జరిగిన ప్రాంతాలు: బుద్ధారం, దీపకుంట, పానగల్ చెరువు, ఉదయ సముద్రం జలాశయ కాలువ, స్మృతివనం/శ్మశానవాటిక పరిసరాల్లోని ప్రభుత్వ భూములు, చెరువుల నుంచి మట్టిని తరలించారని ఆరోపించారు.
60 అడుగుల లోతు గుంతలు: కొన్ని చోట్ల ఏకంగా సుమారు 60 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారని, తవ్వకాల లోతు, విస్తీర్ణం, పరిమాణాన్ని సంయుక్త సర్వే ద్వారా కొలిచి అనుమతులతో సరిపోల్చాలని కోరారు.
రూ. 140 కోట్ల దోపిడీ అంచనా: ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 2 లక్షల టిప్పర్ లోడ్ల మట్టిని తరలించారని, ఒక్కో లోడుకు స్థానిక విలువ రూ. 7,000 చొప్పున దీని మొత్తం విలువ రూ. 140 కోట్లు ఉంటుందని వినతిపత్రంలో వివరించారు. ఇందుకు ప్రభుత్వానికి రాయల్టీ లేదా సీనరేజ్ చెల్లించారా లేదా అనే దానిపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
చౌడు మట్టి, బండరాళ్లతో రోడ్డు పునాది.. ల్యాబ్ టెస్టులు చేయించాలి!
పానగల్ చెరువు ప్రాంతం నుంచి తీసిన చౌడు మట్టి, ఇతర చెరువుల నుంచి తీసిన బంక మట్టిని రోడ్డు పునాదిలో వాడారని, మట్టిపొరల కింద పెద్ద బండరాళ్లు వేసి కప్పారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిర్దేశించిన చోట్ల జీఎస్బీ (GSB), డబ్ల్యూఎంఎం (WMM) పొరల మందం, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో స్వతంత్ర ప్రయోగశాల ద్వారా పరీక్షలు జరిపించాలని కోరారు.
కలెక్టర్‌కు చెప్పినా స్పందన లేదు.. ట్రాఫిక్‌కు తెరవకముందే తనిఖీలు చేయాలి!
ఈ అంశాలను గతంలో జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు లిఖితపూర్వక నివేదిక అందలేదని డా. నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతుతో ఈ పనులు కొనసాగాయన్న ఆరోపణలపై సంబంధిత ఆదేశాలు, సమాచార మార్పిడిని పరిశీలించి ఆధారాల మేరకు బాధ్యత నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతుల పరిశీలన పూర్తయ్యే వరకు వివాదాస్పద చోట్ల తవ్వకాలు నిలిపివేసి, తనిఖీ చేయాల్సిన రోడ్డు పొరలను కప్పకుండా ఉంచాలని, లోపాలు నిర్ధారణైతే కాంట్రాక్టర్ ఖర్చుతోనే సరిచేయించి, రహదారిని ట్రాఫిక్‌కు తెరవకముందే నాణ్యత పరీక్షలు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.







