
Video: టీచర్స్ డే రోజే టీచర్లను, కళాకారులను ఘోరంగా అవమానించిన ఎమ్మెల్యే
- టీచర్స్ డే నాడు రాజకీయ దుమారం..
- రసమయి బాలకిషన్‌పై కవ్వంపల్లి ఘాటు వ్యాఖ్యలు
- “నువ్వు చేసిందే బోడి టీచర్ ఉద్యోగం.. నేను డాక్టర్” అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
కరీంనగర్, ఈ క్షణం: టీచర్స్ డే సందర్భంగా మానకొండూరు రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత రసమయి బాలకిషన్‌పై మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ వృత్తిని అవమానించేలా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
రసమయి బాలకిషన్ గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
“డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడి పైసలు అడుక్కునే బిచ్చగాడివి. నీకు అంత పెద్ద ఇల్లు ఎలా వచ్చింది? నేను డాక్టర్‌ను. నువ్వు చేసిందే బోడి టీచర్ ఉద్యోగం కదా” అంటూ రసమయిని ఉద్దేశించి కవ్వంపల్లి వ్యాఖ్యానించారు.
టీచర్ వృత్తిపై వ్యాఖ్యలతో వివాదం
టీచర్స్ డే రోజునే ఒక ప్రజాప్రతినిధి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ విమర్శల్లోనూ భాషా పరిమితులు పాటించాలనే చర్చ మొదలైంది.
అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థుల మధ్య కొనసాగుతున్న విమర్శల్లో భాగంగానే వచ్చాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, రసమయి బాలకిషన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
మానకొండూరులో మళ్లీ రాజకీయ వేడి
మానకొండూరు నియోజకవర్గంలో కవ్వంపల్లి సత్యనారాయణ, రసమయి బాలకిషన్ మధ్య గతంలోనూ రాజకీయ విమర్శలు చోటుచేసుకున్నాయి. తాజాగా టీచర్స్ డే సందర్భంగా కవ్వంపల్లి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇరువర్గాల మధ్య రాజకీయ వేడిని పెంచే అవకాశం కనిపిస్తోంది.







