Eekshanam Exclusive: గడువు ముగిసిన ఏజెన్సీ.. ప్రాణం కోల్పోయిన మమత!

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బాలింత మమత ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన వెనక ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వ్యవస్థ వైఫల్యం, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా గడువు ముగిసిన అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కాంట్రాక్టును కొనసాగించడమే ఇలాంటి ఘటనలకు కారణమైందన్న ఆరోపణలు తీవ్రతరమయ్యాయి.

ముంబైకి చెందిన ఏ1 అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి లో సుమారు 230 మంది పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 60 మంది సెక్యూరిటీ, 70 మంది పేషెంట్‌ కేర్, వంద మందికి పైగా శానిటేషన్‌ విభాగం సిబ్బంది ఉన్నారు. అయితే వీరిలో చాలామందికి ఆసుపత్రి సేవలపై అనుభవం లేదని, తగిన అర్హతలు కూడా లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ నియామకాల కోసం లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందికి కనీస శిక్షణ కూడా ఇవ్వలేదని ఆసుపత్రి ఉద్యోగులే చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, రోగులతో ఎలా వ్యవహరించాలి, భద్రతా నియమాలు ఎలా పాటించాలి అన్న విషయాల్లో తీవ్ర లోపాలు ఉన్నట్లు ఈ ఘటన బయటపెట్టింది.

సీసీటీవీ దృశ్యాల ప్రకారం మమత అర్ధరాత్రి 1:57 గంటలకు వార్డులో నుంచి ఒంటరిగా బయటకు వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న చీరతో ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న నీటి ట్యాంకు వద్ద ఇనుప రాడుకు ఉరేసుకుంది. ఆ ప్రాంతం పోస్టుమార్టం గదికి కొంత దూరంలో ఉండటంతో అక్కడ సీసీ కెమెరాలు లేవు. అంతేకాకుండా ఆ ప్రాంతం పూర్తిగా చీకటిగా ఉందని అధికారులు గుర్తించారు. ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన రోగిని సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గమనించలేదు? ఆమె చాలా సేపు బయట ఉన్నప్పటికీ ఎలాంటి అలర్ట్‌ ఎందుకు ఇవ్వలేదు?

ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది రౌండ్లలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం సిబ్బంది తమకు కేటాయించిన విభాగాల వద్దే ఉండాలి. కానీ సూపర్‌వైజర్లతో కలిసి రౌండ్ల పేరుతో తిరుగుతున్నారని, దాంతో ఐసీయూ(ICU), ఇన్‌సెంటివ్‌ కేర్‌ ఇలా ప్రధాన యూనిట్లు, వార్డుల నుంచి ఎవరు బయటకు వస్తున్నారు అన్న పర్యవేక్షణ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సెలవులో ఉండగా, డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. దీంతో ఏ విభాగంలో ఏం జరుగుతుందో సమన్వయం లేకుండా పోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్‌ నారాయాణ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ వ్యవస్థ ఇప్పుడు పనిచేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఘటన అనంతరం హైదరాబాద్‌ నుంచి వచ్చిన డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) శ్రీవాణి ఆసుపత్రి అధికారులను తీవ్రంగా నిలదీశారు. “సెక్యూరిటీ సిబ్బంది అసలు ఏమి చేస్తున్నారు?” అని ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన సెక్యూరిటీ సిబ్బందిని తొలగించాలని కూడా సూచించినట్లు తెలిసింది.

ఏ1(A1) ఏజెన్సీపై గతంలోనే అనేక ఫిర్యాదులు వచ్చాయి. సిబ్బందికి జీతాలు ఆలస్యంగా చెల్లించడం, పీఎఫ్‌(PF), ఈఎస్‌ఐ(ESI) చెల్లింపుల్లో లోపాలు, రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. ఆసుపత్రి అధికారులు పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా చర్యలు తీసుకోలేదని వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీకి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల సహకారంతోనే అది కొనసాగుతోందని ఆరోపణలు బలపడుతున్నాయి. డ్యూటీ రికార్డులు, హాజరు వివరాలు, సిబ్బంది మార్పులపై సరైన డాక్యుమెంటేషన్‌ కూడా లేదని తెలుస్తోంది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఏ1 ఏజెన్సీ కాంట్రాక్టు ఈ ఏడాది జనవరితోనే ముగిసింది. ఆ తర్వాత కొత్త టెండర్లు పిలిచి మరో ఏజెన్సీని ఎంపిక చేయాల్సి ఉండగా, ఇప్పటికీ అదే ఏజెన్సీ సేవలు కొనసాగుతున్నాయి. టెండర్లు ఎందుకు పిలవలేదన్న ప్రశ్నకు ఇప్పటివరకు అధికారిక సమాధానం లేదు. ఒక బాలింత అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకునే వరకు ఎవ్వరూ గమనించకపోవడం సాధారణ నిర్లక్ష్యం కాదు. భద్రతా వ్యవస్థ, పర్యవేక్షణ, నిర్వహణ, అవుట్‌సోర్సింగ్‌ నియామకాలు అన్నీ విఫలమయ్యాయని ఈ ఘటన చెబుతోంది. మమత మృతి వెనక ఉన్న అసలు కారణాలను వెలికితీయాలంటే సమగ్ర విచారణ తప్పనిసరి అని ప్రజలు, వైద్య వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Leave a Reply