Eekshanam Exclusive: కొండా సురేఖకు మంత్రి పదవి ఔట్?

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కూడా అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖకు వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలకు తాను బాధ్యత వహించలేనని, అవి తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ వివరణ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కొండా సురేఖ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలంటే ముఖ్యమంత్రి సిఫార్సు కీలకం. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే గవర్నర్‌కు సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని తాజా నివేదిక పేర్కొంది.

మరోవైపు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జి. చిన్నారెడ్డి విషయంలోనూ అధిష్టానం కఠిన వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల చిన్నారెడ్డి కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది.

తాజా సమాచారం ప్రకారం ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే.. పార్టీ పరంగా మాత్రమే కాకుండా ప్రభుత్వంలో ఆయనకు ఉన్న కీలక పదవిపైనా చర్యలు తీసుకునే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం ఒక్కసారిగా ముదిరింది. పరకాల రాజకీయాల నుంచి కాంగ్రెస్‌లోని అంతర్గత వ్యవహారాల వరకు ఆమె పలు అంశాలను ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి కుటుంబంపై ఆరోపణలు చేయడంతో పాటు.. పరకాల నుంచి తానే పోటీ చేస్తానని సుస్మిత ప్రకటించడం కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా స్పందించింది. సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ముఖ్యమంత్రిపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

ఇక్కడ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవంత్‌రెడ్డి ముందుగా అమెరికా వెళ్లాల్సి ఉండగా.. కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో ఆ పర్యటన రద్దయింది. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నారని, ఆగస్టు 23న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇదే సమయంలో సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాల్లో అధిష్టానం నిర్ణయం వెలువడటంతో.. సీఎం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలను విడివిడిగా చూడలేమన్న అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించే ధోరణి పెరగడం, పార్టీ అంతర్గత విభేదాలు మీడియా ముందుకు రావడం అధిష్టానానికి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ అసమ్మతికి కఠినంగా చెక్ పెట్టాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు తాజా నివేదిక పేర్కొంది.

అయితే సురేఖను కేబినెట్ నుంచి తొలగించడం, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ పదవి నుంచి తొలగించడం ఇంకా అధికారికంగా అమలులోకి రాలేదు. ఆగస్టు 23 తర్వాతే ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply