Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండలో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు వైద్యుల నైపుణ్యం, వైద్య సేవల నాణ్యత, అత్యాధునిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడంపైనే ఆసుపత్రుల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పేషెంట్‌ను ఎవరు తీసుకొస్తున్నారు?.. ఆ పేషెంట్ కోసం ఎంత ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అన్నదే కొన్ని ఆసుపత్రుల మధ్య పోటీకి కేంద్రబిందువుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేషెంట్లను ఆసుపత్రులకు రిఫర్ చేసే వ్యక్తులు, మధ్యవర్తులు, రిఫరల్ నెట్‌వర్క్‌లు, కొందరు వైద్యుల చుట్టూ ఏర్పడుతున్న వ్యవస్థకు భారీ ప్రోత్సాహకాలు, కమీషన్లు ఆఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ప్రైవేటు ఆసుపత్రుల మధ్య పేషెంట్ల కోసం ఆధిపత్య పోరు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. ‘వైద్య సేవల పోటీ’ కాస్తా ‘పేషెంట్ వేట’గా మారుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా నల్లగొండలోని ఐకాన్ ఆసుపత్రిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించడం, రికార్డులు స్వాధీనం చేసుకోవడం, అనంతరం షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఈ వ్యవహారాన్ని మరోసారి చర్చలోకి తెచ్చింది.
నల్లగొండలో ఐకాన్ ఆసుపత్రి ప్రవేశంతో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వైద్య వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ తరహా వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలు, హైదరాబాద్‌లో అందుబాటులో ఉండే కొన్ని ప్రత్యేక వైద్య సేవలను జిల్లా కేంద్రంలోనే అందించే ప్రయత్నాలు.. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రావడం.. మొత్తం మీద నల్లగొండ వైద్య రంగంలో పోటీని పెంచాయి.
అయితే ఐకాన్ ఆసుపత్రి మార్కెట్లోకి వచ్చిన తర్వాత పేషెంట్లను తీసుకొచ్చే వ్యక్తులకు భారీగా కమీషన్లు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు పోటీ ఆసుపత్రుల వర్గాల్లో వినిపిస్తున్నాయి. పేషెంట్‌ను తీసుకొచ్చిన వ్యక్తికి 50 శాతం వరకు కమీషన్ ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
ఈ ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండలో కొత్తగా ఏర్పాటవుతున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. భారీ భవనాలు, ఐసీయూలు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, స్కానింగ్ సదుపాయాలు, ప్రత్యేక వైద్య విభాగాలు.. ఇలా ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయి.
There is an issue displaying Amazon products. Please contact the administrator to check that.అయితే భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత పేషెంట్లను ఆసుపత్రికి రాబట్టడం యాజమాన్యాలకు ప్రధాన సవాల్‌గా మారుతోంది. దీంతో కొందరు రిఫరల్ వ్యవస్థలను ఆశ్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేషెంట్‌ను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మళ్లించే వ్యవస్థలో కమీషన్లు, ప్రోత్సాహకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొందరు వైద్యులు ఆరోపిస్తున్నారు.
దీంతో పోటీ ‘ఎవరి వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయి?’ అనే స్థాయి నుంచి ‘పేషెంట్ ఎవరిది?’ అనే స్థాయికి దిగజారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నల్లగొండ ప్రైవేటు వైద్య రంగంలో మరో ప్రత్యేక పరిస్థితి కనిపిస్తోంది. సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్న కొందరు స్పెషలిస్టులే నగరంలోని ఇతర ఆసుపత్రుల్లోనూ విజిటింగ్ కన్సల్టెంట్లుగా సేవలందిస్తున్నారు.
ఒకే డాక్టర్ నాలుగైదు ఆసుపత్రుల్లో విజిటింగ్ డాక్టర్‌గా ఉండటం సాధారణంగా మారిందన్న చర్చ ఉంది. నల్లగొండతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాలకు వెళ్లి కూడా స్పెషలిస్ట్ సేవలు అందిస్తున్న వైద్యులు ఉన్నారు.
వైద్యుల కొరత ఉన్న ప్రాంతాల్లో స్పెషలిస్ట్ సేవలు అందుబాటులోకి రావడం ఒక కోణమైతే.. ఒకే సమయంలో ఒకే డాక్టర్ ఎన్ని ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నారు? అత్యవసర పరిస్థితుల్లో ఆయన అందుబాటులో ఉంటారా? అనే ప్రశ్నలు మరోవైపు తలెత్తుతున్నాయి.
కొన్ని ఆసుపత్రుల బోర్డులపై ప్రముఖ స్పెషలిస్టుల పేర్లు కనిపిస్తున్నప్పటికీ.. అవసరమైన సమయంలో ఆ వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
విజిటింగ్ డాక్టర్ల వ్యవస్థ విస్తరించడంతో పేషెంట్‌కు అసలు బాధ్యత వహించే వైద్యుడు ఎవరు? అన్న విషయంలో కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అత్యవసర చికిత్స, ఐసీయూ సేవలు, ఆపరేషన్ల సమయంలో సంబంధిత వైద్యుడు అందుబాటులో ఉండటం అత్యంత కీలకం.
అందుకే ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్, విజిటింగ్ వైద్యుల వివరాలు, వారి అర్హతలు, అందుబాటులో ఉండే సమయాలు, ఆసుపత్రి అనుమతుల్లో పేర్కొన్న వైద్యుల వివరాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
There is an issue displaying Amazon products. Please contact the administrator to check that.నల్లగొండ ప్రైవేటు వైద్య రంగంలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వైద్యులు సమూహాలుగా ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుంటున్నారన్న చర్చ కూడా వైద్య వర్గాల్లో ఉంది. ఒక ఆసుపత్రిలో పనిచేసిన కొందరు వైద్యులు తర్వాత సొంతంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవడం, పరస్పర పరిచయాలు, పెట్టుబడుల ఆధారంగా కొత్త వైద్య సంస్థలు ఏర్పడటం జరుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి.
అయితే వైద్య రంగాన్ని కులాల ఆధారంగా విభజించడం సరికాదని మరో వర్గం వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైద్య సేవల నాణ్యత, వైద్యుల అర్హతలు, ఆసుపత్రుల అనుమతులు, పేషెంట్ల భద్రతే ప్రమాణాలుగా ఉండాలని వారు పేర్కొంటున్నారు.
మరోవైపు వైద్య వృత్తితో ప్రత్యక్ష సంబంధం లేని కొందరు ఫైనాన్షర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆసుపత్రుల ఏర్పాటులో పెట్టుబడులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వైద్యులను తీసుకొచ్చి సేవలు నిర్వహిస్తున్నారన్న చర్చ కూడా ఉంది.
There is an issue displaying Amazon products. Please contact the administrator to check that.నల్లగొండలో ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారంపై గతంలోనూ వివాదాలు, అధికారుల తనిఖీలు చోటుచేసుకున్నాయి. కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఆ సమయంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించడం, ఫీజుల వసూళ్లను పరిశీలించడం వంటి చర్యలు చేపట్టారు. అనంతరం ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు సంబంధించిన ఫీజుల వివరాలను నోటీసు బోర్డులపై ప్రదర్శించే విధానం మరింతగా అమల్లోకి వచ్చింది.
అయినా కాలం గడిచేకొద్దీ అదే సమస్యలు కొత్త రూపంలో తెరపైకి వస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
రెండేళ్ల క్రితం అపర్ణ ఆసుపత్రికి సంబంధించిన రేడియాలజీ వ్యవహారం కూడా అధికారుల తనిఖీలకు దారితీసింది. రేడియాలజీ సేవలకు సంబంధించి అర్హతలు, సర్టిఫికెట్ల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
రేడియాలజీ సేవలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్న ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అనంతరం ఆసుపత్రి బోర్డులో ‘రేడియాలజీ’ అనే పదాన్ని తొలగించినప్పటికీ స్కానింగ్ సేవలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
అప్పట్లో అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటి? ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో రేడియాలజీ సేవలు ఏ అనుమతులతో కొనసాగుతున్నాయి? అనే అంశాలపై మరోసారి సమీక్ష అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవరకొండ రోడ్డులో ఆర్‌ఎంపీలు సొంతంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసి, విజిటింగ్ డాక్టర్లను తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారన్న వ్యవహారం గతంలో వివాదంగా మారింది.
అర్హతలు, అనుమతులు లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నారన్న ఆరోపణలపై కొందరు ఆర్‌ఎంపీలపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ వ్యవహారం వెనుక ప్రైవేటు ఆసుపత్రుల మధ్య పోటీ కూడా ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.
ఒక వర్గం మరో వర్గంపై అధికారులకు ఫిర్యాదులు చేయడం, పోలీసు కేసుల వరకు వ్యవహారం వెళ్లడం.. నల్లగొండ ప్రైవేటు వైద్య రంగంలో అంతర్గత పోటీ ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది.
తాజాగా ఐకాన్ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు, రోగుల మరణాలకు సంబంధించిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు రికార్డులు పరిశీలించారు. మూడేళ్ల కాలంలో 191 మంది మరణించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో సంబంధిత కేస్‌షీట్లు, రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆసుపత్రి అనుమతి సమయంలో పేర్కొన్న వైద్యులకు భిన్నంగా ఇతర వైద్యులు ఉన్నారన్న అంశాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు.
అయితే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తాము నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తున్నామని, అధిక ఫీజులు వసూలు చేయడం లేదని, తమపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది.
మరోవైపు బాధిత కుటుంబాల నుంచి కూడా అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికిత్సకు భారీగా ఖర్చయిందని, సరైన సమాచారం ఇవ్వలేదని తదితర ఆరోపణలు కుటుంబ సభ్యులు చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
ఐకాన్ వ్యవహారంతో ఇప్పుడు మరో కీలక ప్రశ్న ముందుకొస్తోంది. నిబంధనల ఉల్లంఘనలు ఎక్కడైనా ఉంటే.. ఒక్క ఆసుపత్రిపైనే కాదు, జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులపైనా సమగ్ర తనిఖీలు ఎందుకు నిర్వహించకూడదు?
ప్రైవేటు ఆసుపత్రుల అనుమతులు, వైద్యుల అర్హతలు, విజిటింగ్ డాక్టర్ల వివరాలు, రేడియాలజీ అనుమతులు, ల్యాబొరేటరీల లైసెన్సులు, ఐసీయూ ప్రమాణాలు, అత్యవసర వైద్య సేవలు, ఫీజుల వసూళ్లు, పేషెంట్లకు జారీ చేస్తున్న బిల్లులు, రిఫరల్ వ్యవస్థ.. ఇలా ప్రతి అంశాన్ని అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఒక ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడం కంటే మొత్తం వ్యవస్థను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థలను గుర్తించడం ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే అనేక సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అధికారులు స్పందించడంలో ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని ఆసుపత్రుల నుంచి అధికారులకు ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు గతంలో వచ్చినప్పటికీ.. అలాంటి ఆరోపణలకు ఆధారాలు ఉంటే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉంది.
అపర్ణ ఆసుపత్రి వ్యవహారంలోనూ చర్యలను నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు గతంలో వినిపించాయి. ఇప్పుడు ఐకాన్ వ్యవహారంలోనూ ఎలాంటి ఒత్తిళ్లు, రాజీలు లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రైవేటు వైద్య రంగంలో పోటీ ఉండటం తప్పు కాదు. కొత్త ఆసుపత్రులు రావడం, అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రావడం, వివిధ విభాగాల్లో స్పెషలిస్టు వైద్యులు సేవలు అందించడం ప్రజలకు మేలు చేసే పరిణామాలే.
కానీ ఆ పోటీ పేషెంట్లను ఆకర్షించేందుకు కమీషన్లు, రిఫరల్స్, మధ్యవర్తిత్వం, అనవసర పరీక్షలు లేదా చికిత్సల ఆరోపణల దిశగా వెళ్తే మాత్రం అది ప్రజారోగ్యానికి ప్రమాదకరం.
పేషెంట్ ఒక వస్తువు కాదు. అతడి ప్రాణం, ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితి వైద్య వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యమైన అంశాలు.
నల్లగొండలో ప్రస్తుతం బయటపడుతున్న పరిణామాల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రతి ప్రైవేటు ఆసుపత్రిపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, అనుమతులు, వైద్యుల అర్హతలు, విజిటింగ్ డాక్టర్ల వివరాలు, రేడియాలజీ, ల్యాబొరేటరీలు, ఐసీయూ, అత్యవసర సేవలు, ఫీజులు, బిల్లులు, రిఫరల్ వ్యవస్థ వంటి అన్ని అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఆసుపత్రుల మధ్య పోటీ ఉండొచ్చు.. కానీ పేషెంట్ ప్రాణాలతో పోటీ ఉండకూడదు. నల్లగొండలో ముదురుతున్న ఈ ‘మెడికల్ కోల్డ్‌వార్’కు తెరపడాలంటే.. ఆసుపత్రుల సంఖ్య కాదు, వైద్య సేవల నాణ్యత, పారదర్శకత, నిబంధనల అమలే ప్రమాణంగా మారాలి.