
భువనగిరి రైతుబజార్: బియ్యం ధరలకు కళ్లెం!
- రైతుబజార్లో ప్రభుత్వ ధరలకే బియ్యం విక్రయాలు
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలిసారిగా భువనగిరిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
- మూడు రకాల బియ్యం అందుబాటులోకి..
- బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం
భువనగిరి ఈక్షణం: రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతుబజార్లో ప్రభుత్వ నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించే ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి మంగళవారం ఈ కౌంటర్‌ను ప్రారంభించారు.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కౌంటర్లో మూడు రకాల బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించనున్నారు. బీపీటీ రకం కిలో రూ.66, తెలంగాణ సోనా రూ.74, జేఎస్ఆర్ రకం రూ.79 చొప్పున అందుబాటులో ఉంచారు.
మార్కెట్ ధరల భారానికి ఉపశమనం
ప్రస్తుతం బియ్యం కొనుగోలు కోసం వినియోగదారులు బయట మార్కెట్లో అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు కొంత మేర ధరల భారం తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం లభించనుండటంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రజలు బయట మార్కెట్లో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయకుండా రైతుబజార్‌లోని ప్రత్యేక కౌంటర్‌ను వినియోగించుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి కోరారు.







