దేవుడా.. మళ్లీ జన్మంటూ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు.. కన్నీరు పెట్టించే సూసైడ్ నోట్

వరంగల్ ఈక్షణం, నవంబర్ 18: అప్పుల బాధలు, రుణదాతల సూటిపోటి మాటలు, అవమానాలు ఓ మధ్యతరగతి దంపతుల నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ముందుగా తాము ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు కుక్కకు విషమిచ్చి చంపి, ఆపై తామూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వరంగల్ నగరంలోని రంగశాయిపేట పరిధిలో గల ఎస్‌బీఐ కాలనీలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది. మృతులను ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నల్లపోగుల సంజయ్ కుమార్ (60), టైలరింగ్ చేస్తున్న ఆయన భార్య శోభ (53) గా పోలీసులు గుర్తించారు.

సంజయ్ కుమార్, శోభ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు కాగా, వారు వృత్తి రీత్యా ముంబైలో స్థిరపడ్డారు. వరంగల్ ఎస్‌బీఐ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న ఈ దంపతులు డ్రైవింగ్, టైలరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కుటుంబ అవసరాల నిమిత్తం చేసిన అప్పులకు సకాలంలో వడ్డీలు చెల్లించలేకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి, అవమానాలు ఎదురయ్యాయి. ఇటీవల అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి.. “మీకే తిండికి దిక్కు లేదు.. మీకు పెంపుడు కుక్క ఎందుకు?” అంటూ తీవ్రంగా అవమానించినట్లు తెలుస్తోంది. ఆ మాటలతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

అప్పుల వారి అవమానాలను భరించలేక, ముంబైలో ఉన్న తమ కుమారులకు ఆర్థికంగా భారం కాకూడదని భావించిన సంజయ్ కుమార్, శోభ దంపతులు చావే శరణ్యమని నిర్ణయించుకున్నారు. తాము చనిపోతే అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క అనాథ అవుతుందని భావించి, దానికి విషమిచ్చి చంపారు. అనంతరం దంపతులిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు దంపతులు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో.. “అప్పు ఇచ్చిన వారి అవమానాలు తట్టుకోలేక, మా కొడుకులకు భారం కావొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాము. మాతో పాటు జీవించిన కుక్కకు మాతోనే దహన సంస్కారాలు చేయండి. దేవుడా.. మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు” అని రాసిన వాక్యాలు స్థానికులను, పోలీసులను సైతం కంటతడి పెట్టించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.