Eekshanam Exclusive: నీలగిరి కొండలకు ఘాట్‌ కళ

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నీలగిరి పట్టణానికి కొత్త అందాలు అద్దేలా.. కొండలపైకి సరికొత్త బాటలు పరుచుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్‌ సాహెబ్‌ గుట్ట ఘాట్‌ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకవైపు బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్‌ రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనదారుల సందడి మొదలైంది. మరోవైపు లతీఫ్‌ సాహెబ్‌ గుట్టపై రోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.140 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే నీలగిరి పట్టణ రూపురేఖల్లో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది.

బ్రహ్మంగారి గుట్ట ఘాట్‌ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తికావడంతో పట్టణ ప్రజలు కొత్త రహదారిపై ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. బైక్‌ లు, కార్లపై గుట్టపైకి వెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో గుట్టపై ఉన్న శివాలయం, అమ్మవారి ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు 1.40 కిలోమీటర్ల పొడవున రూ.40 కోట్లతో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ప్రధాన రోడ్డు పనులు పూర్తికాగా.. ఇంకో లేయర్ బీటీ నిర్మాణం, ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, లైటింగ్‌, పెయింటింగ్‌, ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. డిసెంబర్‌ నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న లతీఫ్‌ సాహెబ్‌ గుట్ట ఘాట్‌ రోడ్డు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. మొత్తం 3.2 కిలో మీటర్ల పొడవున నిర్మించనున్న ఈ రహదారికి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో ఎత్తైన కొండలు, పెద్దపెద్ద బండరాళ్లు ఉండటంతో వాటిని తొలగించేందుకు బ్లాస్టింగ్‌ పనులు సవాల్‌గా మారుతున్నాయి. అయినప్పటికీ పనులను వేగవంతం చేసి మరో ఆరు నెలల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఈ రెండు ఘాట్‌ రోడ్ల నిర్మాణానికి మొత్తం సుమారు రూ.140 కోట్ల అంచనా వ్యయంతో 2025 మార్చిలో పనులు ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం 2027 చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిర్ణీత గడువు కంటే ముందుగానే రెండు రహదారుల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్రహ్మంగారి గుట్ట రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆలయాలకు వెళ్లే భక్తులకు సౌకర్యం కలగనుంది. లతీఫ్‌ సాహెబ్‌ గుట్ట రహదారి కూడా పూర్తయితే పట్టణానికి మరో కొత్త ఆకర్షణ తోడుకానుంది. కొండలపైకి విస్తరిస్తున్న ఈ రెండు మార్గాలు నీలగిరి పట్టణానికి సరికొత్త శోభను తీసుకురానున్నాయి.

నల్లగొండ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కార్పోరేషన్ను ‘సూపర్‌ స్మార్ట్‌ సిటీ’ గా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి ఇంటికీ 24 గంటల తాగునీరు అందించడంతోపాటు సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే మరో రూ.200 కోట్ల నిధులు మంజూరుకానున్నాయి. నల్గొండ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం ఇప్పటికే రూ.900 కోట్లు మంజూరు చేశాం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ, డబుల్‌ రోడ్లు వేస్తున్నాం. ఆర్‌డబ్ల్యూఎస్‌(RWS) ద్వారా రూ.43 కోట్లు మంజూరు చేయించాం. బ్రహ్మంగారి గుట్ట వద్ద ఘాట్‌ రోడ్డు నిర్మాణం, నూతన కలెక్టరేట్‌ భవనం వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నాం. రూ.86 కోట్లతో ఏటీసీ (ATC) సెంటర్‌ను ప్రారంభించాం. ఛాయా సోమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించాం. ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడమే నా లక్ష్యం. దర్వేశిపురం దేవాలయ అభివృద్ధికి మరో రూ.20 కోట్లు కేటాయించాం. వైఎస్సార్‌ నగర్‌లో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణతోపాటు మెడికల్‌ కాలేజీ వద్ద కూడా నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం. నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం.