Eekshanam Exclusive: అన్నీ వేళ్లూ.. ఉత్తమ్‌ వైపే!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్‌ డ్యామ్‌ పరిధిలో ఏం జరుగుతోంది? జలాశయంలో 510 అడుగుల డెడ్‌ స్టోరేజీ స్థాయి ఉండగా.. దానికంటే దిగువన 492 అడుగుల వద్ద బ్లాస్టింగ్‌ చేస్తూ ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మిస్తున్నారనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. డ్యామ్‌ బయట నుంచి చూస్తే కనిపించని విధంగా లోపలి భాగంలోనే పనులు జరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.1,200 కోట్ల విలువైన పనులు 2025 నుంచే కొనసాగుతున్నట్లు తెలుస్తున్నా.. తెలంగాణ ఇరిగేషన్‌ యంత్రాంగానికి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు సాగర్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌పై ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎస్‌ఈ ఆధిపత్యం, ఏపీ ఇరిగేషన్‌ అధికారులతో ఆయనకున్నట్లు చెబుతున్న సంబంధాలు, కింది స్థాయి అధికారులపై వేధింపులు, అధికారులే సొంత జేబుల నుంచి ఖర్చులు భరించాల్సిన పరిస్థితి.. వెరసి సాగర్‌ సర్కిల్‌ వివాదాలకు కేంద్రంగా మారింది. గతంలో పనిచేసిన ఈఈ సైతం ఎస్‌ఈ వ్యవహారశైలి భరించలేక బదిలీ చేయించుకున్నారనే చర్చ సాగుతోంది. ప్రస్తుత ఇన్‌చార్జి ఈఈకి కూడా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే అవకాశం లేకుండా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నా సొంత జిల్లాలోని సాగర్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పర్యవేక్షణ ఏ మేరకు ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నాగార్జునసాగర్‌ జలాశయం పరిధిలో జరుగుతున్న పనుల స్వరూపం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. సుమారు రూ.1,200 కోట్లతో 2025 నుంచి పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జలాశయం డెడ్‌ స్టోరేజీ స్థాయి 510 అడుగులుగా ఉండగా.. 492 అడుగుల దిగువన బ్లాస్టింగ్‌ చేస్తూ ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మిస్తున్నారనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. నీటిలో బ్లాస్టింగ్‌ చేసి, పెద్దపెద్ద రాళ్లను తొలగిస్తూ లోపలి భాగంలో నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డ్యామ్‌ బయట నుంచి సాధారణంగా పరిశీలించినా ఈ పనులు కనిపించని విధంగా జలాశయం లోపలి భాగంలోనే నిర్మాణం జరుగుతోందనే చర్చ సాగుతోంది. ఇంతటి కీలకమైన నిర్మాణం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. పనులకు సంబంధించిన అనుమతులు, సాంకేతిక వివరాలు తెలంగాణ అధికారులకు తెలుసా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డ్యామ్‌ భద్రత, జలాశయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

సాగర్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎస్‌ఈ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో అదే ప్రాంతంలో ఈఈగా పనిచేసి, పదోన్నతిపై మళ్లీ అక్కడే ఎస్‌ఈగా కొనసాగుతున్న ఆయన.. మొత్తం యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని సర్కిల్‌పై ఆధిపత్యం చలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ ఇరిగేషన్‌ అధికారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ కూడా శాఖలో సాగుతోంది. ముఖ్యంగా ఎడమ కాల్వకు సంబంధించి నీటి రీడింగ్‌ తీసుకునేందుకు వచ్చే ఏపీ అధికారులతో ఎస్‌ఈ తరచూ కలుస్తుండేవారని చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా అదే ప్రాంతంలో పనిచేస్తూ పదోన్నతి పొందిన తర్వాత కూడా అక్కడే కొనసాగడం, కింది స్థాయి అధికారులపై ఆధిపత్యం చలాయించడం వెనుక ఏపీ ప్రయోజనాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు కూడా చర్చకు వస్తున్నాయి. తెలంగాణ పరిధిలోని కీలక జలవనరుల వద్ద ఏపీ అధికారులు పనులు చేపడుతున్న సమయంలో ఇక్కడి యంత్రాంగం పాత్ర ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

ఏపీ వైపు పనులు జరుగుతున్న విషయాన్ని ఇరిగేషన్‌ అధికారులు ఆగస్టులోనే గుర్తించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో డీఈలు, ఏఈలు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి వచ్చి ఎస్‌ఈకి వివరించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తమ పరిధిలోని ఈఈకి తెలియజేయకుండా నేరుగా ఎస్‌ఈ వద్దకే తీసుకెళ్లడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. అప్పుడే ఈఈకి సమాచారం అందించి ఉంటే.. రాతపూర్వక నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ సమాచారాన్ని ఎస్‌ఈ స్థాయిలోనే పరిమితం చేయడంతో కీలక పరిణామాలు ఉన్నతస్థాయికి చేరలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తాగునీటి పథకానికి సంబంధించిన పనులుగానే భావించి పక్కన పెట్టారనే చర్చ కూడా సాగుతోంది. ఏపీ చేపడుతున్న పనుల స్వరూపం, బ్లాస్టింగ్‌, ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణం వంటి అంశాలపై అప్పుడే అప్రమత్తమై ఉంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సాగర్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌లో ఎస్‌ఈ వ్యవహారశైలి ఇప్పటిది కాదనే చర్చ అధికారుల్లో సాగుతోంది. గతంలో అక్కడ ఈఈగా పనిచేసిన సీతారాం.. ఎస్‌ఈ వేధింపులు భరించలేక చింతపల్లికి బదిలీ చేయించుకున్నారని చెబుతున్నారు. సాగర్‌ సర్కిల్‌లో పనిచేసిన సమయంలో సుమారు రూ.3 లక్షల వరకు తన సొంత డబ్బులను సర్కిల్‌ అవసరాల కోసం ఖర్చు పెట్టినట్లు సమాచారం. వివిధ కార్యక్రమాలు, అధికారిక అవసరాలకు సొంత జేబు నుంచి ఖర్చు చేయాల్సి రావడం, ఎస్‌ఈ వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదురుకావడంతోనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని శాఖలో చర్చ నడుస్తోంది. సీతారాం బదిలీ తర్వాత సాగర్‌ ఈఈగా బాధ్యతలు చేపట్టేందుకు ఇతర అధికారులు కూడా ముందుకు రాలేదనే ప్రచారం ఉంది. దీంతో మిర్యాలగూడలో ఈఈగా పనిచేస్తున్న అధికారికి సాగర్‌ ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఒక కీలకమైన ఇరిగేషన్‌ సర్కిల్‌లో పూర్తిస్థాయి ఈఈ పోస్టు భర్తీ కాకుండా, అధికారులు అక్కడ పనిచేయడానికి వెనుకాడే పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మిర్యాలగూడ ఈఈకి సాగర్‌ అదనపు బాధ్యతలు ఆగస్టులో అప్పగించారు. అంటే ఆయన అక్కడ బాధ్యతలు చేపట్టి మూడు నెలలు కూడా పూర్తికాలేదు. అయినప్పటికీ పూర్తిస్థాయి ఈఈగా విధులు నిర్వహించే అవకాశం లేకుండా ఎస్‌ఈ వివిధ రకాలుగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్‌ కెనాల్‌ నీటి రీడింగ్‌లు పరిశీలించడం, ఉదయం, సాయంత్రం నీటి లెక్కలు తీసుకోవడం వరకే ఆయన బాధ్యతలను పరిమితం చేశారనే వాదన ఉంది. తన పరిధిలోని పనులు, కాంట్రాక్టర్ల బిల్లులు, ఇతర పరిపాలనా వ్యవహారాల్లోనూ ఎస్‌ఈ జోక్యం చేసుకుంటున్నారని చెబుతున్నారు. డివిజన్‌ తన పరిధిలో ఉన్నప్పటికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని, ప్రతి అంశంలోనూ ఎస్‌ఈ అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. గత ఈఈ సీతారాం ఎదుర్కొన్న పరిస్థితులే ఇప్పుడు ప్రస్తుత ఇన్‌చార్జి ఈఈకి కూడా ఎదురవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగోలా మూడు నెలలుగా బాధ్యతలు నెట్టుకొస్తున్న తరుణంలో.. ఇప్పుడు ఏపీ పనుల వివాదం ఆయన మెడకు చుట్టుకుందని, తనకు సంబంధం లేని వ్యవహారంలో అనవసరంగా ఇరుక్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తమవుతోంది.

సాగర్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌లో జరుగుతున్న పరిణామాలు చీఫ్‌ ఇంజినీర్‌ స్థాయికి కూడా పూర్తిస్థాయిలో చేరలేదనే చర్చ ఇప్పుడు శాఖలో ఆసక్తికరంగా మారింది. సర్కిల్‌ పరిధిలోని పనులను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల మధ్యే సమన్వయం లేకపోవడం, ఎస్‌ఈ నుంచి ఈఈకి, అక్కడి నుంచి సీఈకి సమాచారం చేరకపోవడం పరిపాలనా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతోంది. సాగర్‌ను ఉన్నతాధికారులు తరచూ సందర్శిస్తున్నప్పటికీ.. ఇంతటి కీలకమైన పనుల గురించి ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎస్‌ఈ వ్యవహారశైలిపై గతంలోనూ కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫైళ్లను వెనక్కి పంపడం, అనవసరంగా ఉద్యోగులను కార్యాలయంలో ఎక్కువసేపు ఉంచడం, కింది స్థాయి అధికారుల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈఈగా పనిచేసిన సీతారాం బదిలీ కావడం, ఆ తర్వాత ఎవరూ అక్కడ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాకపోవడం, ప్రస్తుత ఇన్‌చార్జి ఈఈకి కూడా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే అవకాశం లేకపోవడం ఈ ఆరోపణలకు మరింత ప్రాధాన్యం తెస్తోంది.

ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ సొంత జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్‌ వంటి అత్యంత కీలకమైన జలాశయం పరిధిలో ఇంతటి పరిణామాలు చోటుచేసుకుంటున్నా.. శాఖాపరంగా సమగ్ర పర్యవేక్షణ ఎందుకు కొరవడిందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాల్లో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల పరిశీలన, సమీక్షలకు ప్రాధాన్యం ఇస్తున్న మంత్రి.. సాగర్‌ సర్కిల్‌లో జరుగుతున్న పనులపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా సమీక్షలు నిర్వహించడం ఒకటైతే.. క్షేత్రస్థాయిలో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు? ఏపీ అధికారులు ఏ పనులు చేస్తున్నారు? తెలంగాణ అధికారుల పర్యవేక్షణ ఎంతవరకు ఉంది? అన్న అంశాలపై నిరంతర సమీక్ష అవసరం. దాదాపు రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నా.. ఆగస్టులోనే క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తం చేసినా.. ఇప్పటికీ ఈ వ్యవహారం వివాదంగా మారడం శాఖలో పర్యవేక్షణ లోపాలను సూచిస్తోంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం తన పనులు కొనసాగిస్తోందనే ఆరోపణలు.. మరోవైపు తెలంగాణ ఇరిగేషన్‌ యంత్రాంగంలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం.. ఇంకోవైపు ఎస్‌ఈ ఆధిపత్యంపై విమర్శలు.. ఇవన్నీ మంత్రి పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

సాగర్‌ పనుల వ్యవహారం బయటపడటంతో ఇప్పుడు ఎవరిపై చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ అధికారుల్లో నెలకొంది. క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసిన డీఈలు, ఏఈలు, సంబంధిత ఈఈలపై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొందరు అధికారులు తమ ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్నట్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో ఎస్‌ఈ మాత్రం తనపై చర్యలు పడకుండా ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు శాఖలో ప్రచారం జరుగుతోంది. సెక్రటరీ స్థాయిలో తన వాదన వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఏపీ అధికారులతో ఉన్న పరిచయాలు, రాజకీయ సంబంధాలను ఉపయోగించుకుని ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు పైరవీలు సాగిస్తున్నారనే చర్చ నడుస్తోంది. కీలక సమాచారం తన స్థాయిలోనే నిలిచిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఈ బాధ్యత ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో సీతారాం, ఇప్పుడు ప్రస్తుత ఇన్‌చార్జి ఈఈ.. ఇలా ఎస్‌ఈ వ్యవహారశైలితో కింది స్థాయి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చర్చ నడుస్తున్న క్రమంలో.. ఇప్పుడు వివాదం మొత్తం కింది స్థాయి అధికారులపైకి నెట్టబడుతుందా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నాగార్జునసాగర్‌ వంటి అత్యంత కీలకమైన జలాశయం పరిధిలో ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతున్నా నిఘా వర్గాలకు సమాచారం లేదా? 2025 నుంచే పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తున్నా.. 492 అడుగుల వద్ద బ్లాస్టింగ్‌ చేస్తూ ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మిస్తున్న వ్యవహారం ఇంతకాలం ఎలా వెలుగులోకి రాలేదు? ఆగస్టులో ఇరిగేషన్‌ శాఖ డీఈలు, ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎస్‌ఈకి వివరించినప్పటికీ.. ఈ సమాచారం ఇతర ఉన్నతాధికారులకు చేరలేదనే చర్చ సాగుతోంది. సాగర్‌ వద్ద రెండు రాష్ట్రాల అధికారుల రాకపోకలు, నీటి రీడింగ్‌ల పరిశీలన, నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాల్సి ఉంటుంది. చిన్నచిన్న పరిణామాలపైనా ఆరా తీసే నిఘా వ్యవస్థకు ఇంతటి కీలకమైన పనుల గురించి తెలియకపోవడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం తెలిసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదా? లేక క్షేత్రస్థాయిలో నిఘా వైఫల్యమా? అన్నది తేలాల్సి ఉంది. సాగర్‌ పరిధిలో ఇంటెలిజెన్స్‌ నిఘా వ్యవస్థ పనితీరుపైనా సమీక్ష జరపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.