BRS నేతల అరెస్టులపై జగదీష్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్ / నల్లగొండ ఈక్షణం: ఉదయం నుంచే బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను అక్రమంగా అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డి సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో రాష్ట్ర డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తాము ధర్నాలు, నిరసనలు చేయడానికి కాకుండా చట్టబద్ధంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కు వినతిపత్రం ఇవ్వడానికే వెళ్తున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. “కేవలం నలుగురు ప్రజాప్రతినిధులం వెళ్లి విజ్ఞాపన పత్రం ఇస్తామన్నా ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?” అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ తెలంగాణ ప్రజల గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు.

అనుమతులు లేకుండా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగతనంగా అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.

ప్రభావిత ప్రాంతాలు: ఏపీ అక్రమ నిర్మాణాల వల్ల హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.

హైదరాబాద్ భవిష్యత్తుపై ఆందోళన: మంచి నీళ్ల పేరుతో నీటిని తరలిస్తూ హైదరాబాద్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా లొంగిపోయిందని జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరైంది కాదన్నారు. అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని, కేఆర్‌ఎంబీకి వినతిపత్రం సమర్పించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.