
హాలియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించాలి
- పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి
- అధికారులకు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశం
హాలియా, ఈక్షణం: హాలియాలో నూతనంగా నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మిగిలిపోయిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని త్వరగా ప్రారంభించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మంగళవారం అనుముల మండలం హాలియాలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితారాణిని ప్రారంభానికి సంబంధించిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ను త్వరగా సమకూర్చుకోవాలని సూచించారు. పరికరాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఓపీ సేవలు ప్రారంభిస్తామని సూపరింటెండెంట్ కలెక్టర్‌కు వివరించారు.
ఆసుపత్రిలోని ఓపీ విభాగం, గైనిక్ రూమ్, పీడియాట్రిక్ వార్డు, లేబర్ రూమ్, జనరల్ వార్డు, ఫార్మసీ, డిస్పెన్సరీ, ల్యాబ్, ఎముకల శస్త్రచికిత్స విభాగం, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. ప్రతి విభాగంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, వార్డులు, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపయోగించిన నీడిల్స్, సిరంజిలు, కాటన్ తదితర వైద్య వ్యర్థాలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని వార్డులకు స్పష్టంగా కనిపించేలా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన ఏర్పాట్లను తనిఖీ చేయాలని, ఫైర్ సిబ్బందిని పిలిపించి అగ్నిమాపక పరికరాల పనితీరు, గడువు తేదీలను పరిశీలించాలని ఆదేశించారు. టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, నీటి లీకేజీలు లేకుండా చూడాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి అత్యవసర వైద్య సేవలకు అవసరమైన పరికరాలు, సౌకర్యాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో భర్తతో కలిసి ఉన్న గర్భిణీ మహిళను కలెక్టర్ పలకరించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వైద్యులు సక్రమంగా చికిత్స అందిస్తున్నారా, అవసరమైన మందులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు శ్రద్ధగా వైద్యం అందిస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఆమె కలెక్టర్‌కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్ భానుప్రసాద్, మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితారాణి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్లు స్వాతి, నవీన్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.







