
Breaking News: హుజూర్నగర్ కాంగ్రెస్లో తిరుగుబాటు!
- సొంత పార్టీ చైర్మన్పైనే కౌన్సిలర్ల నిరసన
- రూ.6 కోట్ల నిధుల ఖర్చుపై నిలదీత..
- బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి సమావేశం బహిష్కరణ..
- రెండుగా చీలిన అధికార పార్టీ
హుజూర్నగర్, ఈక్షణం: హుజూర్నగర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. సొంత పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో సుమారు రూ.6 కోట్ల నిధుల వినియోగంపై లెక్కలు వెల్లడించాలని పట్టుబడుతూ మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరించారు. అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్లు చైర్మన్ తీరును తప్పుబట్టడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులతో కలిసి నిరసనకు దిగడం మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రూ.6 కోట్ల లెక్కలపై నిలదీత
మున్సిపాలిటీకి చెందిన సుమారు రూ.4 కోట్ల జనరల్ ఫండ్, రూ.2 కోట్ల క్యాపిటల్ ఫండ్ నిధులను ఏయే పనులకు, ఏయే వార్డుల్లో ఎంతమేర ఖర్చు చేశారో పూర్తి వివరాలు వెల్లడించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన నిధుల ఖర్చు అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. నిధుల జమా, ఖర్చుల వివరాలను పారదర్శకంగా వెల్లడించకుండా సమావేశాలు నిర్వహించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎజెండా ఇవ్వకుండానే సమావేశమా?
తాము కౌన్సిలర్లుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిధుల వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలు, సమావేశాల ఎజెండాను ముందస్తుగా అందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగానే ఎజెండా ఇవ్వకుండా ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రజాప్రతినిధులను అగౌరవపరచడమేనని విమర్శించారు. నిధుల ఖర్చుపై పూర్తి వివరాలు బహిర్గతం చేయడంతోపాటు, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలోనే వివరాలు అందిస్తామని చెప్పడం, వాటిని గోప్యంగా ఉంచాలని సూచించడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్, కమిషనర్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.
రెండు వర్గాలుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు
మొత్తం 28 మంది కౌన్సిలర్లున్న హుజూర్నగర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు, బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు సభ్యులు కలిసి సమావేశాన్ని బహిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు అట్లూరి మంజుల, ఎడ్ల విజయ్, కోడి జ్యోతి, అమరబోయిన ఊహ, కోలా ఉదయభాను, బీఆర్ఎస్ కౌన్సిలర్లు చిట్టిపోతుల భద్రమ్మ, నల్లగొండ సుజాత నిరసన తెలిపిన వారిలో ఉన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లే చైర్మన్ తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చినట్లయింది.
అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదు: చైర్మన్
మున్సిపాలిటీలో రూ.6 కోట్ల అవినీతి జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, హుజూర్నగర్ మున్సిపాలిటీకి ఏడాది కాలంలో సుమారు రూ.3.30 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఆ మొత్తాన్ని పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, వాహనాల నిర్వహణ, పరిపాలనా అవసరాలు, ఇతర ఖర్చుల కోసం వినియోగిస్తున్నట్లు వివరించారు. క్యాపిటల్ ఫండ్ ద్వారా అత్యవసర అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నిధుల వినియోగంలో వంద శాతం పారదర్శకత పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఖర్చులకు సంబంధించిన వివరాలతో కౌన్సిలర్లకు శ్వేతపత్రాలు అందజేశామని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కమిషనర్ సతీష్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.







