Eekshanam Exclusive: ప్రమాదం తర్వాత.. మళ్లీ పరుగులు!

నల్లగొండ, ఈక్షణం ప్రతినిధి: శ్రీశైల సొరంగ మార్గంలో 2025, ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం తర్వాత నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ) టన్నెల్‌ పనులు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. సవాళ్లను అధిగమిస్తూ సొరంగం తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో రోజుకు రెండు, మూడు మీటర్లు మాత్రమే జరిగే తవ్వకం పనులు.. ప్రమాదం తర్వాత తొలి ఆర్మ్‌ బూమర్‌ మిషన్‌ అందుబాటులోకి రావడంతో 8 మీటర్లకు చేరాయి. తాజాగా రెండో ఆర్మ్‌ బూమర్‌ మిషన్‌ కూడా రావడంతో ఔట్‌లెట్‌ వైపు పనులకు మరింత ఊతం లభించనుంది. ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ రెండు వైపులా కలిపి రోజుకు 15 మీటర్ల వరకు తవ్వకం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ నెలాఖరులోగా మరో కిలోమీటరు పురోగతి సాధించడంపై దృష్టి సారించారు. ఒకవైపు యంత్రాల సామర్థ్యాన్ని పెంచుతూనే.. మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రవేత్తల సూచనలతో భద్రతకు పెద్దపీట వేస్తున్నారు.

టన్నెల్‌ పనులు నిరంతరంగా కొనసాగేందుకు మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో షిఫ్టులో సుమారు 400 మంది చొప్పున కార్మికులు, సాంకేతిక సిబ్బంది పనుల్లో పాల్గొంటున్నారు. తవ్వకం, రాక్‌ బోల్టుల ఏర్పాటు, మక్‌ తొలగింపు, షాట్‌క్రీట్‌, ఇతర రక్షణ చర్యలను సమాంతరంగా చేపడుతున్నారు. ప్రమాదాల నివారణకు జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. టన్నెల్‌-1లో తవ్వకం జరుగుతున్న ప్రాంతానికి సుమారు 50 నుంచి 100 మీటర్ల ముందున్న భౌగోళిక పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అనూహ్య ప్రమాద సూచనలను గుర్తించేలా ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తద్వారా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంటే ముందుగానే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు వీలవుతోంది.

టన్నెల్‌ తవ్వకంలో భౌగోళిక పరిస్థితులు, రాతి పొరల స్వభావం కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌( NGRI), జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ (NIRM) సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలతో అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. సొరంగం లోపల ఎదురయ్యే భౌగోళిక సవాళ్లు, రాతి పొరల స్థితిగతులు, భద్రతాపరమైన అంశాలపై వారి సూచనలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, అవసరమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు. శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలు, ఆధునిక యంత్రాల వినియోగం సమన్వయంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నారు.

ప్రమాదానికి ముందు రోజుకు రెండు, మూడు మీటర్ల మేర మాత్రమే తవ్వకం జరిగేది. ప్రమాదం తర్వాత తొలి ఆర్మ్‌ బూమర్‌ మిషన్‌ అందుబాటులోకి తీసుకురావడంతో రోజువారీ తవ్వకం 8 మీటర్లకు పెరిగింది. ఇప్పుడు రెండో ఆర్మ్‌ బూమర్‌ మిషన్‌ రాకతో ఇన్‌లెట్‌ వైపు పనులకు అదనపు సామర్థ్యం సమకూరింది. దీంతో రెండు వైపుల నుంచి కలిపి రోజుకు 15 మీటర్ల వరకు తవ్వకం చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరు లోగా మరో కిలోమీటరు పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొత్తం 43.968 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్‌-1లో 35.051 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తయింది. ఇంకా 8.916 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. ఇన్‌లెట్‌ వైపు 14.042 కిలోమీటర్లు, ఔట్‌లెట్‌ వైపు 21.009 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. అడ్వాన్స్‌డ్‌ టన్నెలింగ్‌ మెథడ్‌ విత్‌ అబ్జర్వేషనల్‌ టెక్నిక్‌ (ATMOT) విధానంలో ఇప్పటివరకు 866. 3 మీటర్ల మేర పనులు జరిగాయి. ఇందులో ఇన్‌లెట్‌ వైపు 292 మీటర్లు, ఔట్‌లెట్‌ వైపు 574.3 మీటర్లు పూర్తయ్యాయి. నవంబర్‌ 5న రెండు వైపులా చెరో 3.5 మీటర్ల పురోగతి నమోదైంది.

టన్నెల్‌-1తో పాటు టన్నెల్‌-2 పనులూ కొనసాగుతున్నాయి. మొత్తం 7.130 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్‌-2లో తవ్వకం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 4.265 కిలోమీటర్ల మేర లైనింగ్‌ పనులు పూర్తికాగా, మరో 2.865 కిలోమీటర్ల మేర లైనింగ్‌ చేయాల్సి ఉంది. లైనింగ్‌తో పాటు కెర్బ్‌, ఓవర్ట్‌, ఇన్వర్ట్‌, గ్రౌటింగ్‌ పనులను కూడా చేపడుతున్నారు. ఇప్పటివరకు 4,936 మీటర్ల కెర్బ్‌, 4,260 మీటర్ల ఓవర్ట్‌, 4,323 మీటర్ల ఇన్వర్ట్‌, 3,225 మీటర్ల గ్రౌటింగ్‌ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

టన్నెల్‌ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, సైంటిస్టులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. తవ్వకం వేగం పెంచడంతోపాటు కార్మికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. అదనపు యంత్రాలు, మూడు షిఫ్టుల్లో సిబ్బంది, ఆధునిక సాంకేతికత, శాస్త్రవేత్తల సలహాలను సమన్వయం చేస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. జూలై 2028 నాటికి టన్నెల్‌ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో యంత్రాంగం కార్యాచరణ కొనసాగిస్తోంది.