
రైతు మహాసభల వేళ.. నల్లగొండలో సాంస్కృతిక సందడి
- నవంబర్ 14న పెద్దగడియారం సెంటర్‌లో అగ్రి ఎక్స్‌పో, కల్చరల్ ఫెస్ట్
- వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలి..
- మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి పిలుపు!
నల్లగొండ ఈక్షణం, నవంబర్ 10: అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణం మహోజ్వల సాంస్కృతిక శోభను సంతరించుకోనుంది. ఈ నెల 14న పట్టణంలోని పెద్దగడియారం సెంటర్‌లో నిర్వహించనున్న ‘అగ్రి ఎక్స్‌పో మరియు కల్చరల్ ఫెస్ట్’ను అత్యంత వైభవంగా జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా జరిగే ఈ సంబరాల్లో వేలాదిగా ప్రజలు, రైతులు పాల్గొనాలని కోరారు. మంగళవారం పెద్దగడియారం సెంటర్‌లో కల్చరల్ ఫెస్ట్ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వేదికలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు.
రైతు ఉద్యమాల చరిత్రను చాటేలా ప్రదర్శనలు..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ, అనేక చారిత్రాత్మక రైతు ఉద్యమాలకు అఖిల భారత రైతు సంఘం నాయకత్వం వహించిందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ‘దున్నేవాడికే భూమి’ అనే విప్లవాత్మక నినాదంతో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి, ప్రజల విముక్తికి బాటలు వేసిన ఘనత రైతాంగ ఉద్యమానిదని వివరించారు.
రైతాంగ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి..
మహాసభల సందర్భంగా నిర్వహించే ఈ అగ్రి ఎక్స్‌పో, కల్చరల్ ఫెస్ట్‌లో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, రైతాంగ పోరాట చరిత్రను ప్రతిబింబించేలా కళారూపాలు, పల్లె సుద్దులు, కోలాటాలు, భజనలు, ప్రత్యేక నాటకాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సంబరాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండా శ్రీశైలం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్, నలపరాజు సైదులు, అవుట రవీందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.







