అభివృద్ధి పేరుతో అవినీతికి తావివ్వొద్దు: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

ఈక్షణం, చౌటుప్పల్: ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని, పెట్టుబడిదారులు, ధనవంతులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయకూడదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి పేరుతో అవినీతికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన 2,418 మంది లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాల పునాదులపై ఏర్పడినప్పటికీ పేదలకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదనే భావన ప్రజల్లో ఉందన్నారు. సుమారు పదేళ్ల క్రితం కొత్త పింఛన్లు మంజూరు చేశారని, ఆ తర్వాత అర్హులైన వేలాది మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కొన్ని పింఛన్లు మాత్రమే మంజూరయ్యాయని గుర్తుచేశారు.

ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు చేయూత పింఛన్లు అందించడం మంచి నిర్ణయమన్నారు. అయితే అర్హులైన వృద్ధులకు కూడా కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే వృద్ధులకు పింఛన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచాలని సూచించారు. ప్రస్తుత నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పింఛన్ పెంపు అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించారు. పేద లబ్ధిదారులు, వృద్ధుల తరఫున పింఛన్ల పెంపు కోసం తాను పోరాడుతానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ సీఈఓ శోభారాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని, రమేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఈడుదుల మస్తాన్‌బాబు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయక్, చౌటుప్పల్, నారాయణపురం మండలాల ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.