సాగర్ బ్యాక్‌వాటర్‌లో ఏపీ సొరంగ పనులపై వివాదం.. రిటైర్డ్ ఇంజనీర్లు పరిశీలించి ఏమన్నారంటే..

నల్లగొండ / నాగార్జునసాగర్ ఈక్షణం: నాగార్జునసాగర్ జలాశయం బ్యాక్‌వాటర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినట్లు చెబుతున్న ఇన్‌టేక్ వెల్, సొరంగ/సంపు నిర్మాణ పనులను తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కన్వీనర్ శ్యాం ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం నేతృత్వంలోని బృందం సాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనుల స్వరూపాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి పలు కీలక విషయాలను వెల్లడించింది.

జలాశయ నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌టేక్ వెల్, సంపు పనులు జరుగుతున్నాయని, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కి గానీ, తెలంగాణ ప్రభుత్వానికి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదని శ్యాం ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.

నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలో, ముఖ్యంగా రైట్ సైడ్ పరిధిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశ్రాంత ఇంజనీర్ల బృందం అక్కడికి వెళ్లి పరిశీలించింది. బృందంలో ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశంతో పాటు గౌరవాధ్యక్షులు గోలి దామోదర్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ చంద్రమౌళి, ప్యాట్రన్ సత్యరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రమేష్ తదితరులు ఉన్నట్లు వెంకటేశం తెలిపారు.

క్లారిఫికేటర్లు & సంపు నిర్మాణాలు: తాము వెళ్లి పరిశీలించినప్పుడు అక్కడ నాలుగు క్లారిఫికేటర్లు, సంపులకు సంబంధించిన నిర్మాణ పనులు కనబడ్డాయని, అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని తన్నీరు వెంకటేశం వివరించారు.

ఇన్‌టేక్ వెల్ & ఇన్‌లెట్ లెవల్స్: ఇన్‌టేక్ వెల్ డయామీటర్ సుమారు 4 నుంచి 5 మీటర్ల వరకు ఉండవచ్చని, వివిధ నీటి మట్టాల నుంచి నీటిని తీసుకునేలా మూడు ఇన్‌లెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 497, 530, 560 వంటి స్థాయిల వద్ద వాటర్ డ్రా చేసేలా నిర్మాణాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

తాము క్షేత్రస్థాయిలో వెళ్లి చూసినప్పుడు అక్కడ ఎవరూ అడ్డుకోలేదని, ఫొటోలు తీసుకోవడానికి కూడా నిషేధం లేదని, కానీ ఏడాది కాలంగా పనులు జరుగుతున్నా తమ దృష్టికి ఆలస్యంగా రావడం దురదృష్టకరమని వెంకటేశం వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై మాట్లాడిన ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, 2022లోనే పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసిందని, 2024లో గతంలో ఉన్న పల్నాడు గ్రిడ్‌ను ‘అమరజీవి వాటర్ గ్రిడ్’గా మార్చారని పేర్కొన్నారు. సుమారు 33 మండలాలు, 360 గ్రామాలకు మంచి నీరు అందించే సుమారు రూ. 1,200 కోట్ల ప్రాజెక్టుగా దీనిని ప్రచారం చేస్తున్నారని, మంచి నీటి పథకం అయితే తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

అయితే, తెలంగాణ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 83, 84, 85, 86, 87 ప్రకారం అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు నిబంధనలు ఉన్నాయని, ముఖ్యంగా సెక్షన్ 84(3)(2) నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. కొత్త ప్రాజెక్టు లేదా నీటి మళ్లింపునకు సంబంధించి సాంకేతిక వివరాలు, సాధ్యాసాధ్యాలు, బోర్డు అనుమతులపై స్పష్టత ఉండాలని అన్నారు.

ఈ పనుల విషయంలో మంత్రుల మధ్యే భిన్నమైన మాటలు వినిపిస్తున్నాయని, ఒకరికి తెలుసని, మరొకరికి తెలియదని వస్తున్న ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయని తన్నీరు వెంకటేశం అన్నారు. గతంలో పోతిరెడ్డిపాడు విషయంలో జరిగిన అనుభవాలను గుర్తుచేస్తూ, కేవలం తాగునీటి పేరుతో ప్రారంభమై కాలక్రమేణా నీటి తరలింపు సామర్థ్యం పెరిగిన సందర్భాలను ప్రస్తావించారు. అందువల్ల డెడ్ స్టోరేజీ లేదా దిగువ స్థాయిల నుంచి నీటిని తీసుకునే అవకాశం వంటి అంశాలపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కేఆర్‌ఎంబీకి లేఖ రాసి వాస్తవాలను నిగ్గుతేల్చాలని, ప్రజల్లోని భయాందోళనలను తొలగించాలని విశ్రాంత ఇంజనీర్ల సంఘం కోరింది.