SIR: న్యూఢిల్లీలో కాంగ్రెస్ నిరసన హోరు.. రాహుల్‌తో కదం తొక్కిన టీపీసీసీ నేతలు

న్యూఢిల్లీ, ఈ క్షణం, అక్టోబర్ 13: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ (EC) తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో సమరశంఖం పూరించింది. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై సామాన్య ప్రజల ఓట్లను దొడ్డిదారిన తొలగిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఎన్నికల కమిషన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ చారిత్రాత్మక నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎలుగెత్తి చాటారు.

ఢిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి నిరసన ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఈసీ చర్యలను ఎండగట్టేలా సాగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ సంస్థలను భ్రష్టుపట్టిస్తూ అధికార బలంతో సామాన్య ప్రజల ఓట్లను గల్లంతు చేస్తున్న బీజేపీ ప్రభుత్వ కుట్రలను దేశవ్యాప్తంగా ఎండగడతామని స్పష్టం చేశారు. ఓటు హక్కును కాపాడుకునే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply