ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ విధానాలపై సమరభేరి!

నల్లగొండ, ఈక్షణం: ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభ పిలుపునిచ్చింది. వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక వర్గాల ఐక్యతతో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని నేతలు పిలుపునిచ్చారు. రాజకీయ, సైద్ధాంతిక పోరాటాలతోపాటు సామాజిక, సాంస్కృతిక, మీడియా, సంస్థాగత రంగాల్లోనూ ఉద్యమాలను విస్తరించాలని ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధావలే స్పష్టం చేశారు.

నల్లగొండలో నవంబర్‌ 15 నుంచి 18 వరకు జరుగుతున్న ఏఐకేఎస్‌ 36వ జాతీయ మహాసభల్లో సోమవారం ఆయన అధ్యక్ష ప్రసంగం చేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగితే రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలతోపాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపై దాడులు మరింత తీవ్రతరమవుతాయని విమర్శించారు. దేశీయ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలు అమలవుతున్నాయని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ, జాతీయ సార్వభౌమాధికారం, రాజ్యాంగ విలువలకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తుల భావజాలాన్ని ఎదుర్కొనేందుకు రాజకీయ, సైద్ధాంతిక, ఆందోళనాత్మక, సామాజిక, సాంస్కృతిక–సాహిత్య, మీడియా, సంస్థాగత రంగాల్లో నిరంతర పోరాటాలు సాగించాలని ధావలే పిలుపునిచ్చారు. కేవలం ఎన్నికలు, రాజకీయ కార్యకలాపాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలని సూచించారు. లెనిన్‌ ప్రతిపాదించిన ఆందోళన, ప్రచారం, సంస్థాగత నిర్మాణం అనే మూడు సూత్రాలను అన్ని స్థాయిల్లో అమలు చేయాలని, ప్రజల సమస్యల ఆధారంగా మాస్‌లైన్‌ విధానంతో పనిచేయాలని పేర్కొన్నారు. వామపక్షాల స్వతంత్ర బలం, ముఖ్యంగా ఏఐకేఎస్‌ సంస్థాగత శక్తిని వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రైతాంగ ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలమని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు దారితీసిందని, అది దేశ రైతాంగ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. సుమారు 600 రైతు సంఘాలను సంయుక్త కిసాన్‌ మోర్చా వేదికపైకి తీసుకురావడం చారిత్రక పరిణామమన్నారు. రైతులతోపాటు వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు, ఆదివాసీలు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు.

రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసీ సంఘాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నవంబర్‌ 26న దేశవ్యాప్తంగా రైతు ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ రోజు రాత్రి ఆందోళన స్థలాల్లోనే బస చేసి నిరసనలు కొనసాగించాలని, నవంబర్‌ 27న చక్కాజామ్‌ నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల నుంచే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని, వాటిని దేశవ్యాప్త పోరాటాలుగా విస్తరించాలని అన్నారు.

మహాసభకు స్వాగతం పలుకుతూ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను ప్రస్తావించారు. నిజాం నిరంకుశ పాలన, దేశ్‌ముఖ్‌లు, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా రైతులు సాగించిన పోరాటం దేశ చరిత్రలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మల్లు స్వరాజ్యం వంటి నాయకులు, వేలాది మంది అజ్ఞాత యోధుల త్యాగాలను స్మరించారు.

భూమి, ఆహారం, గౌరవప్రదమైన జీవితం కోసం సాగిన ఆనాటి పోరాట స్ఫూర్తిని నేటి వ్యవసాయ సంక్షోభానికి వ్యతిరేకంగా కొనసాగించాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, చట్టబద్ధమైన కనీస మద్దతు ధర, రుణభారం నుంచి విముక్తి, ప్రభుత్వ సేకరణ వ్యవస్థ బలోపేతం, సాగునీరు, విద్యుత్‌, విత్తనాలు, ఎరువుల అందుబాటు వంటి అంశాలపై పోరాటాలు అవసరమని పేర్కొన్నారు. కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళా రైతుల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనుసరిస్తున్న విధానాలను ఎదుర్కొనేందుకు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని ధావలే పిలుపునిచ్చారు. ప్రజల జీవనోపాధి, సామాజిక, ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం విస్తృత ఐక్య కార్యాచరణ అవసరమన్నారు. జర్మనీలో నాజీయిజం, ఇటలీలో ఫాసిజంపై సాగిన చారిత్రక పోరాటాల నుంచి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు.

మహాసభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌. అచ్యుతానందన్‌, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య, ఏఐకేఎస్‌ నేత ఎన్‌. శంకరయ్య, రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తదితర ప్రముఖుల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి నివాళులర్పించారు. రైతు, కార్మిక, ప్రజా ఉద్యమాలకు సేవలందించిన పలువురు నాయకులు, మేధావులు, అమరవీరులను స్మరించుకున్నారు. గాజా, పాలస్తీనా తదితర ప్రాంతాల్లో యుద్ధాలు, హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలు, రైతుల ఆత్మహత్యలు, ప్రకృతి విపత్తుల్లో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.

నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటుండగా, భవిష్యత్తు రైతాంగ ఉద్యమాల దిశ, కార్యాచరణపై చర్చలు కొనసాగుతున్నాయి.